ఆరుతడి పంటల వైపు రైతాంగం..తక్కువ నీటితోనే లాభసాటి వ్యవసాయం

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం సమయానికి నమోదు కాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం లాంటి సమస్యలతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, నీటి ఎద్దడి ఉన్నప్పుడు సంప్రదాయంగా వేసే వరి లాంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా, రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరిగ్గా ఇక్కడే ఆరుతడి పంటలు రైతులకు ఒక వరంగా మారుతున్నాయి.
తక్కువ నీటి వనరులతో పండించే పంటలను సాధారణంగా ఆరుతడి పంటలు అంటారు. వరి, చెరకు లాంటి పంటలకు పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలి. కానీ ఆరుతడి పంటలకు అలా నీరు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నేలలో తగినంత తేమ ఉంటే చాలు, ఇవి అద్భుతంగా పెరుగుతాయి. ఎల్ నినో లాంటి విపత్కర పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుని లాభాలు తెచ్చిపెట్టేవే ఆరుతడి పంటలు. వాటిలో ప్రధానంగా మొక్కజొన్న..ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన ఆరుతడి పంట. తక్కువ నీటితో పాటు, పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. కందులు, పెసలు, మినుములు, శనగలు లాంటి పప్పుధాన్యాలు వర్షాభావ పరిస్థితులను అద్భుతంగా తట్టుకుంటాయి. పైగా ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి నేల సారాన్ని పెంచుతాయి. నూనె గింజలైన.. వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదాలు లాంటి పంటలు తక్కువ నీటితోనే మంచి రాబడినిస్తాయి. ఇక వీటితో పాటు సిరిధాన్యపు పంటలైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, వివిధ రకాల కూరగాయల సాగు, అలాగే దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే చీనీ, బత్తాయి, జామ, మామిడి పండ్ల తోటలు కూడా ఈ ఆరుతడి పంటల జాబితాలోకి వస్తాయి. వరికి బదులుగా ఈ పంటలను ఎంచుకుంటే, నీటి కొరత ఉన్నా సరే రైతులు నష్టాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఆరుతడి పంటల సాగులో పంట ఎంపిక ఎంత ముఖ్యమో, నేల తయారీ , తేమ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. తక్కువ నీరు ఉన్నప్పుడు నేలలోని తేమను సాధ్యమైనంత ఎక్కువ కాలం నిలుపుకోవడంపై రైతులు దృష్టి పెట్టాలి. దీనికోసం వేసవిలో నేలను లోతుగా దున్నుకోవాలి . ఇలా లోతుగా దున్నడం వల్ల వాననీరు నేలలోకి బాగా ఇంకిపోయి భూగర్భంలో తేమ నిల్వ ఉంటుంది, అలాగే భూమి అడుగున ఉన్న చీడపీడల గుడ్లు సూర్యరశ్మికి నశించిపోతాయి. ఇక ఆరుతడి సాగులో అత్యంత కీలకమైన, లాభదాయకమైన టెక్నిక్ మల్చింగ్ . మొక్కల చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఎండుగడ్డి , వ్యవసాయ వ్యర్థాలను పరచడాన్ని సేంద్రియ మల్చింగ్ అంటారు. అదేవిధంగా మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ షీట్లతో నేలను కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ఈ మల్చింగ్ పద్ధతిని వాడటం వల్ల సూర్యరశ్మి నేరుగా నేల మీద పడదు. దీనివల్ల నేల నుండి నీరు గాలిలోకి ఆవిరి కావడం ఏకంగా 50 శాతం వరకు తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంటే మనం ఇచ్చిన నీరు ఎక్కువ రోజులు నేలలోనే నిల్వ ఉండి, మొక్కలకు నిరంతరం తేమను అందిస్తుంది. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల తోటల సాగులో ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ల వాడకం ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది.



