వెనుకడుగు వేసేదే లేదు…ఉరిశిక్షకే ఎదురెళ్తున్న షేక్ హసీనా! బంగ్లాలో పెను సంచలనాలు..!

2024 ఆగస్టులో జరిగిన భారీ విద్యార్థి ఉద్యమం, అల్లర్లతో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియాకు పారిపోయి రావడం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో 18 నెలల పాటు మధ్యంతర ప్రభుత్వం నడవడం, ఆపై 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రావడం చకచకా జరిగిపోయాయి. అయితే హసీనా ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్ లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు ఏకంగా ఉరిశిక్షను ఖరారు చేసింది. అంతే కాదు బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించాలని ఇండియాను కోరుతూనే ఉంది. ఇక ఇలాంటి ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో, ఉరిశిక్షను సైతం లెక్కచేయకుండా తాను డిసెంబర్ లో తిరిగి బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టబోతున్నట్లు షేక్ హసీనా అధికారికంగా ప్రకటించారు. అదే మాట మీద నిలబడుతూ తాజాగా...చావు నా తలరాత అయితే నా దేశ ప్రజల మధ్యే చనిపోతాను తప్ప నా నిర్ణయం మారదు అని ఆమె ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
1996 నుంచి 2001 వరకు ఒకసారి, మళ్లీ 2009 నుంచి 2024 వరకు ఏకధాటిగా నాలుగు సార్లు బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనాకు ప్రస్తుత బంగ్లాదేశ్ లో కనీస అనుకూల రాజకీయ వాతావరణం లేదు. ఆమె స్థాపించిన అవామీ లీగ్ పార్టీని ప్రస్తుత తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసింది. ఈ పార్టీకి చెందిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా లాగేసుకుంది. గత రెండేళ్లలో అవామీ లీగ్ కు చెందిన కనీసం 20 వేల మంది పార్టీ కార్యకర్తలను, నేతలను ప్రస్తుత ప్రభుత్వం అత్యంత కిరాతకంగా చంపేసిందని, వేలాది మందిని జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెడుతోందని హసీనా ఆరోపిస్తున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా తారిఖ్ రెహమాన్ ప్రభుత్వంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో తన పార్టీ కార్యకర్తలు, తన దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఇండియాలో కూర్చుని దూరం నుంచి చూడలేనని, వచ్చే డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి బంగ్లాదేశ్ వెళ్తానని హసీనా స్పష్టం చేశారు. ఒక దేశ మాజీ ప్రధాని, తన స్వంత దేశానికి వెళ్లాలంటే ప్రాణభయంతో వెళ్లాల్సిన పరిస్థితి రావడం నిజంగా గ్లోబల్ పాలిటిక్స్ లో దురదృష్టకరమనే చెప్పాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అతివాద వర్గాల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. ఉగ్రవాద శక్తులు, మత ఛాందసవాదులు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో రెచ్చిపోతున్నారు. తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం వీరికి పరోక్షంగా అండగా నిలుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒకవేళ హసీనా బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టి అరెస్ట్ అయితే.. బ్యాన్ కు గురై సైలెంట్ గా ఉన్న అవామీ లీగ్ క్యాడర్ లో మళ్లీ ఒకసారి జవసత్వాలు అందించినట్లే అవుతుంది. ఆమె అరెస్ట్ ను బేస్ చేసుకుని బంగ్లాదేశ్ లో మరోసారి భారీ ప్రజా ఉద్యమం రగిలించాలని ఆమె మాస్టర్ ప్లాన్ వేసినట్లు దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. షేక్ హసీనాకు ఇండియా మొదటి నుంచీ అండగా ఉంటోంది. ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలన్న ఢాకా విజ్ఞప్తులను న్యూఢిల్లీ న్యాయపరంగా సమీక్షిస్తున్నామని చెబుతూ సున్నితంగా తిరస్కరిస్తోంది. అయితే డిసెంబర్ లో ఆమె బంగ్లాదేశ్ కు వెళ్లేందుకు ఇండియా ఎలాంటి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తుందన్నది చూడాలి. ఇటీవల వాషింగ్టన్ లోని సెంటర్ ఫర్ యూఎస్-బంగ్లాదేశ్ రిలేషన్స్ వర్చువల్ మీటింగ్ లో కూడా హసీనా మాట్లాడుతూ.. అన్ని దేశాలతో స్నేహంగా ఉండటమే నా విదేశాంగ విధానం. కానీ నా సొంత దేశానికి వెళ్లడానికి నాకు ఏ విదేశీ శక్తి ఆశీస్సులు లేదా అనుమతులు అవసరం లేదు. బంగ్లాదేశ్ పాలిటిక్స్ ను ఎక్కువ కాలం ఇలా వదిలేయలేము అని ఆమె స్పష్టం చేశారు. అంటే ఇండియా లేదా అమెరికాల ఒత్తిడితో తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం ఆమెను వదిలేస్తుందన్న ఆశ హసీనాకు లేదు. ఏది ఏమైనా ఆమె ధైర్యంగా అడుగులు ముందుకేయడానికే ఆమె సిద్ధమయ్యారు.



