3 వేల కి.మీ దూరం..48 గంటల భయంకరమైన ఆపరేషన్..ఇరాన్ నౌకను రక్షించిన ఇండియన్ నేవీ

మన తీరానికి ఏకంగా 3,000 కిలోమీటర్లకు పైగా సుదూరంలో.. సముద్రపు దొంగల చేతికి చిక్కిన ఇరాన్‌కు చెందిన ఒక నౌకను మన భారత నౌకాదళం మెరుపు ఆపరేషన్ చేసి రక్షించింది. ఏకంగా 48 గంటల పాటు భయంకరమైన ఆపరేషన్ నిర్వహించి 20 మందిని కాపాడింది. ఇరాన్‌కు చెందిన అజిని అనే ఒక భారీ చేపల వేట నౌక.. ఈశాన్య సోమాలియా తీర ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తోంది. పంట్లాండ్ మారిటైమ్ పోలీస్ ఫోర్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నౌక బందర్ బయ్లా, హఫున్ పట్టణాల మధ్య ఉన్న సముద్ర జలాల్లో కొందరు సముద్రపు దొంగలు ఆ నౌకను చుట్టుముట్టారు. ఆ నౌకలోకి ప్రవేశించి, అందులోని 20 మంది ఇరానియన్ సిబ్బంది తలలకు తుపాకులు గురిపెట్టి బందీలుగా పట్టుకున్నారు. వెంటనే నౌక కంట్రోల్ రూమ్ ను తమ ఆధీనంలోకి తీసుకుని నౌకను హైజాక్ చేశారు. ఆ దొంగల ఉద్దేశం ఒక్కటే.. ఆ నౌకను సోమాలియా తీరంలోని తమ స్థావరాలకు తీసుకెళ్లిపోయి, ఆ సిబ్బంది ప్రాణాలకు బదులుగా ఇరాన్ ప్రభుత్వాన్ని భారీగా డబ్బు డిమాండ్ చేయడం. అయితే హైజాక్ అయిన కొద్ది నిమిషాలకే ఆ నౌక నుంచి ఒక డిస్ట్రెస్ కాల్ బయటకు వెళ్లింది. ఆ సిగ్నల్ నేరుగా ఇండియన్ నేవీకి చేరింది. సమాచారం అందగానే.. ఆ ప్రాంతానికి వందల నాటికల్ మైళ్ల దూరంలో పెట్రోలింగ్ చేస్తున్న భారత నౌకాదళం యుద్ధనౌక వెంటనే యాక్షన్ మోడ్ లోకి వచ్చింది.
దాదాపు అసాధ్యమైనా అందులోనూ ఆ నౌక ఉన్న ప్రాంతం మన ఇండియాకు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఇండియన్ నేవీ ఒక అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేసింది. నౌకలు నీళ్లలో వెతికితే టైమ్ పడుతుంది, అదే ఆకాశం నుంచి వెతికితే టార్గెట్ ఈజీగా దొరుకుతుందని భావించి.. వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. సెకన్ల వ్యవధిలో మన నిఘా విమానాలు, హై-టెక్ డ్రోన్లు గాల్లోకి లేచాయి. అప్పటివరకు కేవలం నావికాదళ ఆపరేషన్ గా ఉన్న ఈ మిషన్ కాస్తా.. నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ గా మారిపోయింది. గాల్లో మన ఎయిర్ ఫోర్స్, నీటి మీద మన నేవీ సముద్రంలో ఆ అజిని నౌక ఆచూకీని డ్రోన్ల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నౌకకు సంబంధించిన ఎగ్జాక్ట్ కో-ఆర్డినేట్స్ ను సముద్రంలో వస్తున్న ఇండియన్ నేవీ వార్ షిప్ కు బదిలీ చేశారు. ఆ సమాచారం అందగానే భారత యుద్ధనౌక ఫుల్ స్పీడ్ తో వెళ్లి ఆ హైజాక్ అయిన నౌకను అడ్డుకుంది. సముద్రపు దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, గాల్లో ఎయిర్ ఫోర్స్ విమానాలు, నీటి మీద భారీ యుద్ధనౌక, మరోవైపు ఆయుధాలతో సిద్ధంగా ఉన్న మన మెరైన్ కమాండోలను చూడగానే ఆ పైరేట్స్ కు వెన్నులో వణుకు పుట్టింది. ఎదురు తిరిగితే ఒక్క సెకనులో కాల్చి పారేస్తారని అర్థమైపోయి ప్రాణభయంతో వాళ్లు లొంగిపోయారు. ఈ మొత్తం ఆపరేషన్ 48 గంటల పాటు ఎంతో టెన్షన్ మధ్య కొనసాగింది. ఫైనల్ గా నవంబర్ 2న నౌకను తమ ఆధీనంలోకి తీసుకుని, అందులో ఉన్న 20 మంది ఇరాన్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో మన రక్షణ దళాలు వందశాతం సక్సెస్ అయ్యాయి.
ఈ ఆపరేషన్ లో ఉన్న అతిపెద్ద గ్రేట్ నెస్ ఏంటంటే.. ఇటు మన వైపు గానీ, అటు హైజాక్ అయిన అమాయక సిబ్బంది వైపు గానీ ఒక్క ప్రాణనష్టం జరగలేదు. కనీసం ఒక్క బుల్లెట్ పేల్చకుండానే.. కేవలం ఇండియన్ ఆర్మీ పేరు చెప్పి, మన యుద్ధనౌకను చూపించి ఆ దొంగలను లొంగిపోయేలా చేశారు మన కమాండోలు. సముద్రపు దొంగల నుంచి ఇరాన్ సిబ్బందిని కాపాడటంలో నౌకాదళం, వైమానిక దళం చూపిన ఈ అద్భుతమైన చొరవను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఒక అతిపెద్ద జియో-పొలిటికల్ మెసేజ్ దాగి ఉంది. రక్షణ మంత్రి చెప్పినట్లు హిందూ మహాసముద్ర ప్రాంత మార్గాల్లో భద్రతకు భారత్ కట్టుబడి ఉంది. దీనినే డిఫెన్స్ భాషలో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటారు. అంటే ఈ సముద్రంలో ఏ దేశ నౌకకు ఆపద వచ్చినా రక్షించడానికి మేమున్నాం అని భారత్ ఒక పెద్దన్న పాత్రను పోషిస్తోంది. గతంలో కూడా పాకిస్థాన్, ఇరాన్, బల్గేరియా దేశాలకు చెందిన ఎంతోమంది నావికులను మన నేవీనే రక్షించింది. చైనా లాంటి దేశాలు ఈ సముద్రంలోకి వచ్చి ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న వేళ, మన తీరానికి 3 వేల కిలోమీటర్ల దూరంలో కూడా మనం ఆపరేషన్స్ చేయగలం అని భారత్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ కు డ్రాగన్ దేశం కూడా సైలెంట్ అయిపోయింది. మతం ఏదైనా, దేశం ఏదైనా ప్రాణం విలువ మన భారతీయులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మనకు బద్ధ శత్రువైన పాకిస్థాన్ నావికులను సైతం మనం కాపాడి ప్రాణభిక్ష పెట్టాం. మన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నంతవరకు హిందూ మహాసముద్రం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉగ్రవాదులు, సముద్రపు దొంగలు భయపడేలా మన దళాలు నిరూపించాయి.



