అనంత మేయర్ పీఠం..నీదా..? నాదా..?
అనంత మేయర్ పీఠం దక్కేదెవరికి..?మేయర్ కుర్చీ కోసం టీడీపీలో పోటీ…సీనియర్లు వర్సెస్ కొత్త ముఖాలు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. అనంతపురం నగర రాజకీయాల్లో మేయర్ పీఠం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా.. అధికార కూటమిలోని ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా టీడీపీలో మేయర్ పదవిని ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేశామని.. కష్టకాలంలోనూ పార్టీని వీడలేదని.. ఇప్పుడు తమకు అవకాశం కల్పించాలని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట. మరోవైపు రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో.. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కవచ్చనే అంశంపై కూడా నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆశావహుల ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు అనంతపురం నగరంపై పట్టు సాధించడం అధికార కూటమికి కీలకంగా మారనుందనే చర్చ సాగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ ఆధిక్యాన్ని సాధించిన నేపథ్యంలో.. ఈసారి నగరంలో తమ బలాన్ని చాటుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట.గత మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం నగరంలోని 50 డివిజన్లకు గాను 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానంలో సీపీఐ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అయితే ప్రస్తుతం నగరంలో డివిజన్ల సంఖ్య 62కు చేరడంతో.. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో నగరంలోని అన్ని డివిజన్లలో కూటమి బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఫలితాలను అధిగమించి.. ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.


