ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్…ఇంతకీ రిలీజ్ ఎప్పుడు?

తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌కు తనదైన శైలిలో పంచులను, వినోదాన్ని జోడించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దిట్ట. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కుటుంబ కథాంశానికి వినోదాన్ని జోడిస్తూ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. సినిమాలో ఓ ప్రత్యేకమైన అతిథి పాత్ర ఉండబోతుందనే ప్రచారం వెంకీ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో కేవలం కుటుంబ కథ, వినోదమే కాకుండా, ఒక ఆసక్తికరమైన కమర్షియల్ ఎలిమెంట్‌ను కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమా కథలో అత్యంత కీలకంగా నిలిచే ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఈ పాత్ర ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లలో ప్రేక్షకులకు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులకు ఒక పర్ఫెక్ట్ థ్రిల్, కిక్ దక్కుతుందని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఆ అతిథి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక స్టార్ హీరోనా? లేక వెంకటేష్ తో గతంలో హిట్ కొట్టిన హీరోయిన్లలో ఎవరైనా ఒకరా? అన్న అంచనాలు మొదలయ్యాయి. ఆ పాత్ర కథను ఒక కీలకమైన మలుపు తిప్పుతుందని, సినిమాకు అది కమర్షియల్‌గా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ సర్ప్రైజ్ రోల్ పై చిత్రబృందం కావాలనే సీక్రెసీ మెయింటైన్ చేస్తోందని, థియేటర్లలోనే ఆ కిక్ ను ఫీల్ అవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.
వెంకటేష్ సరసన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, సీనియర్ నటులు రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు ఈ ఫ్యామిలీ డ్రామాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు, రావు రమేష్, బ్రహ్మాజీల కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల వైకుంఠపురములో, గుంటూరు కారం లాంటి ఆల్బమ్స్ తర్వాత థమన్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో పాటలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అంతా బాగానే ఉంది కానీ, సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం అభిమానుల్లో చిన్నపాటి కన్ఫ్యూజన్ నడుస్తోంది. వాస్తవానికి ముందుగా కుదుర్చుకున్న షెడ్యూల్ ప్రకారం ఆదర్శ కుటుంబం చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరికొన్ని కారణాల వల్ల ఆ తేదీకి సినిమాను తీసుకురాలేకపోయారు. దీనితో వెంకీ అభిమానులు కాస్త నిరాశ చెందారు.అయితే మొదట డిస్ట్రిబ్యూటర్ల వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 30న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు టాక్ నడిచింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డేట్ న కూడా ఆదర్శ కుటుంబం రావడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ జైలర్ 2 ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. అక్టోబర్ 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాగవంశీ బిజీగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ మరుసటి రోజే రణబాలి కూడా రిలీజ్ కు రెడీ అవడంతో నాగవంశీ ఈ మూవీరమోషన్లను కొద్దిగా ఆలస్యం చేయాలని భావిస్తున్నట్లు టాక్. అందుకే ఆదర్శ కుటుంబం ఈ నెలాఖరున రావడం కూడా కష్టమేనట. ఇక అక్టోబర్ 30 దాటింది అంటే ... చివరికి ఈ సినిమాని నవంబర్ 20కి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రానప్పటికీ , ఈ డేట్ మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కత్తి పట్టి నరికే సినిమాలు, రక్తం ఏరులై పారే యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు, వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ ఆదర్శ కుటుంబం కచ్చితంగా ఒక రిలాక్సింగ్ ట్రీట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేష్‌కు కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ, త్రివిక్రమ్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో ఉన్న ప్రత్యేకత ఈ సినిమాను సూపర్ హిట్ తీరాలకు చేరుస్తాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆ అతిథి పాత్ర గురించిన సస్పెన్స్, అక్టోబర్ 30 రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.



