ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు…స్పీకర్ ఎన్నిక అంశంలో నెతన్యాహూకు ఎదురుదెబ్బ

మిడిల్ ఈస్ట్ లో ఒకవైపు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ లను సవాలు చేస్తూ తడాఖా చూపిస్తున్న ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అంతర్గత రాజకీయాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సొంత పార్లమెంట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో కీలకంగా భావించే ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ గా నెతన్యాహు అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి, ఇజ్రాయెల్ మాజీ సైన్యాధిపతి అయిన గాడి ఐసెన్కాట్ వర్గానికి చెందిన మాటన్ కహానా స్పీకర్ గా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో నెతన్యాహు లాంటి స్ట్రాంగ్ లీడర్ కు సొంత పార్లమెంట్ లో పరాభవం ఎదురుకావడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ లో మొత్తం 120 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఐసెన్కాట్ వర్గానికి చెందిన మాటన్ కహానాకు 66 మంది సభ్యులు మద్దతు పలకగా.. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ అభ్యర్థి ఒఫిర్ కాట్జ్కు కేవలం 52 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇప్పటివరకు స్పీకర్గా కొనసాగిన నెతన్యాహు వర్గానికి చెందిన అమీర్ ఓహానా పదవిని కోల్పోయారు. ఈ మార్పు ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే, పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ జరపాలి? ఏ బిల్లులను ఓటింగ్ కు తీసుకురావాలనే విషయాల్లో స్పీకర్ కు సర్వాధికారాలు ఉంటాయి. ఇప్పుడు స్పీకర్ సీటు ప్రతిపక్షం వైపుకు పోవడంతో నెతన్యాహు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే విపక్ష కూటమికి పార్లమెంట్ లో పైచేయి లభించినట్లయింది. నెతన్యాహు ఇకపై ఏకపక్షంగా తన ఇష్టమొచ్చిన బిల్లులను పాస్ చేసుకునే అవకాశం లేదు.



