టైగర్ ష్రాఫ్ కాదు..ఆమిర్ ఖానే అసలు టార్గెట్.. మూడో పెళ్లే కొంపముంచిందా?

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ లాంటి అండర్ వరల్డ్ డాన్స్ శాసించారు. కానీ ఇప్పుడు కాలం మారింది, కొత్త డాన్స్ వచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోల గుండెల్లో నిద్రపోతున్న ఒకే ఒక్క పేరు.. లారెన్స్ బిష్ణోయ్. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్.. ఇప్పుడు తమ రూట్ మార్చింది. అక్టోబర్ 18న ముంబయిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన జుహులో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఎటాక్ లో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా, అతని డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ముంబై పోలీసులు జరిపిన విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు ఆమిర్ ఖాన్ ను హతమార్చడానికి హరియాణా నుంచి సుపారీ తీసుకున్న ఇద్దరు ప్రొఫెషనల్ షూటర్లు సెప్టెంబర్ 20న ముంబయి నగరంలోకి ఎంటర్ అయ్యారు. దాదాపు ఒక నెల రోజుల పాటు ముంబై సిటీలో మకాం వేసి, అమిర్ ఖాన్ నివాస ప్రాంతాన్ని ఏకంగా మూడుసార్లు జల్లెడ పట్టి, పక్కాగా రెక్కీ నిర్వహించారు. కానీ ఆమిర్ ఖాన్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఆయన ప్రాణాలను కాపాడింది. ఆమిర్ కు బయట పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లే అలవాటు చాలా తక్కువ. ఆయన ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, లేదా కట్టుదిట్టమైన భద్రత మధ్య సినిమా షూటింగ్‌ల కోసం వెళ్లి రావడం జరిగేది. షూటింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లాక, రోజుల తరబడి ఆయన తన ఇంటి కాంపౌండ్ వాల్ దాటి బయటకు రాలేదు. దీంతో నెల రోజులు వెయిట్ చేసినా నిందితులకు ఏమాత్రం అవకాశం దొరకలేదు. ఆమిర్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్న వారి ప్రయత్నాలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, అమెరికాలో ఉన్న తమ బాస్ ల నుంచి వచ్చిన ఆదేశాలతో నిందితులు తమ మాస్టర్ ప్లాన్‌ను మార్చుకోవాల్సి వచ్చింది.
అలా ఆమిర్ ఖాన్ దొరక్కపోవడంతో.. అక్టోబర్ తొలి వారంలో నిందితులు తమ టార్గెట్ ను బాలీవుడ్ యంగ్ అండ్ ఫిట్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ పైకి మళ్లించారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం బాంద్రా ఏరియాలో ఫుట్‌బాల్ ఆడేందుకు బయటకు తరచూ వస్తుంటాడు. ప్రతి వారం ఒకే టైమ్, ఒకే గ్రౌండ్ కు వస్తుండటం షూటర్ల పనిని ఈజీ చేసింది. ఆమిర్ ఖాన్‌తో పోలిస్తే టైగర్ ష్రాఫ్ కదలికలను గుర్తించడం, అతడిపై దాడి చేసి పారిపోవడం చాలా సులభమని భావించే వాళ్లు టార్గెట్‌ను మార్చుకున్నారు. అదే అక్టోబర్ 18న జుహు ప్రాంతంలో కాల్పులకు దారితీసింది. అసలు బిష్ణోయ్ గ్యాంగ్ కు ఆమిర్ ఖాన్ పై ఎందుకు కోపం వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలపై పోలీసులు లోతుగా అన్వేషిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమిర్ ఖాన్‌కు ఈ ఏడాది జులైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. గౌరీ స్ప్రాట్ తో ఆయన మూడో వివాహం చేసుకోవడం కారణంగా.. ఆ గ్యాంగ్‌కు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు, ఆడియో క్లిప్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఆడియో క్లిప్స్ లో ఆమిర్ ఖాన్ ఉద్దేశపూర్వకంగానే లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారని నిందితులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ బెదిరింపులు నిజమైనవేనని, అవి పంపింది బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులేనని ముంబయి పోలీసులు కూడా ధ్రువీకరించారు. కచ్చితంగా ఈ కారణం వల్లే ఆమిర్ ఖాన్ పై దాడికి కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
టైగర్ ష్రాఫ్‌పై జరిగిన ఈ దాడికి తానే బాధ్యుడినని గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ ప్రకటించుకున్నాడు. ఇతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో లింక్స్ పెట్టుకుని, ఏకంగా అమెరికా నుంచే ఈ ముంబై ఆపరేషన్ ను కంట్రోల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో అందరినీ భయపెడుతున్న మరో కీలకమైన విషయం.. అరెస్ట్ అయిన 11 మంది నిందితులను ఇంటరాగేట్ చేయగా బయటపడిన లిస్ట్. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బడా స్టార్స్ అయిన రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇళ్ల దగ్గర కూడా ఈ గ్యాంగ్ ఇప్పటికే రెక్కీ నిర్వహించినట్లు ఒప్పుకున్నారు. కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, తమకు నచ్చని పనులు చేస్తే బాలీవుడ్ లో ఎవరినైనా టార్గెట్ చేస్తామనే రేంజ్ లో బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ముంబై పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.



