నిరసనల అడ్డా జంతర్ మంతర్ డీనోటిఫై..ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం!

గత కొన్నేళ్లుగా నిరసనలకు వేదికగా ఉన్న నిరసనల అడ్డా జంతర్ మంతర్ ప్రదేశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక నిరసనలకు వేదికగా ఉండబోదని స్పష్టమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జంతర్ మంతర్ ను డీ నోటిఫై చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
జంతర్ మంతర్ ప్రదేశానికి బదులుగా మరికొన్ని ప్రాంతాలను సూచించారు. రామ్ లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్ ను నిరసన వేదికలుగా ఉపయోగించుకోవాలని పోలీసులు తెలిపారు. నిరసనలు, ధర్నాల కోసం ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించేందుకు ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేయగా…ఆ కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్ ను నిరసనల వేదికగా డీనోటిఫై చేస్తున్నట్లు కొత్త వేదికల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి విధి విధానాలను త్వరలోనే జారీ చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ తమ ప్రకటనలో తెలిపారు.
ఇక జంతర్ మంతర్ వద్ద నిరసనల కారణంగా ప్రజా జీవనానికి ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయం కొన్నేళ్లుగా వ్యక్తమవుతూనే ఉంది. అలాగే ట్రాఫిక్ జామ్ లు అక్కడ వ్యాపారాలకు కూడా ఇబ్బంది కలగడం సాధారణ పౌరులకు భారంగా మారిన సందర్భాలు ఉన్నాయి. నీట్ అంశంపై గళమెత్తిన కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ నిరసనలు చేసిన నేపథ్యంలో ఈ ప్రదేశం బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్టోబర్ లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ మరియు ఇతర సంఘాలు నిర్వహించిన నిరసనల సమయంలో కూడా ఆ ప్రదేశంలో ఇటువంటి తీవ్ర సమస్యలు వ్యక్తమయ్యాయి.
జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల కారణంగా సాధారణ ప్రజల జీవనానికి, ముఖ్యంగా రవాణా, వ్యాపార రంగాలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, కన్నాట్ ప్లేస్ (CP) వంటి అత్యంత రద్దీ మరియు కీలక ప్రాంతాలకు ఇది దగ్గర్లో ఉండటం ఇక్కడ నిరసనలు జరిగినప్పుడల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది కొందరి వాదన. నిజంగానే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగినప్పుడు శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బారికేడ్లు పెడుతుంటారు. దాదాపు 30కి పైగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ను నిలిపివేయడం లేదా దారి మళ్లించడం వంటివి జరగడం వలన ఉదయం, సాయంత్రం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాసంస్థలకు వెళ్లాలంటే స్టూడెంట్స్ కు గంటల తరబడి ట్రాఫిక్‌లో చుక్కలు కనిపిస్తాయి. అలాగే ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాల వల్ల జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్న మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేయడం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వ్యాపారులు కూడా భారీగానే ఈ నిరసనల సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. జంతర్ మంతర్ పరిసరాలు అలాగే కన్నాట్ ప్లేస్ కు ఢిల్లీలో అతిపెద్ద బిజినెస్ సెంటర్ గా పేరుంది. నిరసనలు, పోలీసుల బారికేడ్ల వల్ల ఆ ప్రాంతానికి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడంతో దుకాణదారులు, హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కస్టమర్లు లేక ఆర్థికంగా నష్టపోపోతున్నట్లు చిన్న చిన్న వ్యాపారస్తులు సహా అందరూ తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి నిరసన వేదికను మార్చడంతో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో..ఇక ఇప్పటి వరకు ఎన్నో నిరసనలకు వేదికగా ఉన్న ఈ ప్రాంతం హిస్టరీ చూసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. జంతర్ మంతర్ అనేది మన దేశంలో కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, 18వ శతాబ్దపు అద్భుతమైన ఖగోళ శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనంగా చరిత్ర కారులు అభివర్ణిస్తారు. అప్పటి జైపూర్ మహారాజు సవాయి జైసింగ్ II గణితం, వాస్తుశిల్పం, ఖగోళశాస్త్రంపై ఉన్న ఆసక్తితో దేశంలో ఐదు చోట్ల అంటే ఢిల్లీతో పాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలో వీటిని కట్టించారు.
