75 శాతం సమాజానికి దానం.. పుత్రశోకంలో కూడా మరోసారి ప్రకటించిన అనిల్ అగర్వాల్

Spread the love

ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబంలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఆయన తనయుడు  అగ్నివేశ్ అగర్వాల్ (49) అమెరికాలో ఆకస్మిక మరణం చెందారు. ఈ విషాద సమయంలో  తన సంపాదనలో 75 శాతం సమాజ సేవకు కేటాయిస్తానని గతంలో చేసిన వాగ్దానాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కుమారుడి మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన అనిల్ అగర్వాల్, ‘ఎక్స్’ వేదికగా ఎమోషనల్  పోస్ట్ పెట్టారు. కుమారుడు అగ్నివేశ్ ఎంతో తొందరగా  మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అతడి వయసు 49 సంవత్సరాలు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలుండేవి. అమెరికాలో జరిగిన స్కీయింగ్ యాక్సిడెంట్ లో  గాయపడిన అగ్నివేశ్, హాస్పిటల్ లో  కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని వదిలి  వెళ్లిపోయాడు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎంతో ఒదిగి ఉండేవాడు. ఒక ఫ్రెండ్ లా వెంటే ఉండేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే, నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదు. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని అనిల్ రాసుకొచ్చారు.అనిల్ అగర్వాల్ కు అగ్నివేశ్ తో పాటు కూతురు ప్రియ ఉన్నారు. ఆమె వేదాంతా లిమిటెడ్ బోర్డు మెంబర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. వేదాంతా అనుబంధ సంస్థ తల్వండి సోబో పవర్ లిమిటెడ్ కు  అగ్నివేశ్ చైర్మన్. అనిల్ అగర్వాల్ నికర సంపద 330 కోట్ల డాలర్లు. అగ్నివేశ్ అకాల మరణంపై ప్రధాని నరేంద్రమోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు ఆ  కుటుంబానికి ధైర్యమివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.