కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మాగాంధీ పేరుతో నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం పేరు మార్చి, ఉద్దేశాన్ని నీరుగార్చి పేదలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ పథకాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకోవాలని ఈ సమావేశంలో నాయకులు తీర్మానించారు. ఈ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ పథకాన్ని యదాతథంగా పునరుద్ధరించాలన్న డిమాండ్ తో ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 3 నుండి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీ కాదు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు.