ఆర్థిక సర్వే గిగ్ వర్కర్లు 40 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవస్థలో గణనీయమైన, విధానపరమైన మార్పులు అవసరమని వెల్లడించింది. వారికి న్యాయమైన వేతనాలు అందించేందుకు వీలుగా వెయిటింగ్ టైమ్ పరిహారంతో పాటు గంటకు లేదా ప్రతి పనికి కనీస ఆదాయం అందించాలని సూచించింది. రూల్స్ మార్పులే లక్ష్యంగా గిగ్-ఎకానమీ విధానం ఉండాలని తెలిపింది. గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్నా అస్థిరత ఓ కీలక సమస్యగా మిగిలిపోయిందని, ఇది లోన్స్ పొందడంలో అడ్డంకులు సృష్టిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. దీంతో గిగ్ వర్కర్లు ఫైనాన్సియల్ గా వెనకబడి ఉన్నారని, రుణాలు పొందే అవకాశాలు తక్కువగా ఉండటం వారిలో ఆందోళనలు పెంచుతోందని అభిప్రాయపడింది. గిగ్ వర్కర్లలో దాదాపు 40శాతం మంది నెలకు రూ.15వేల కన్నా తక్కువే సంపాదిస్తున్నారని ఆర్థిక సర్వే అంచనా వేసింది. లిమిటెడ్ స్కిల్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ డెవలప్మెంట్ కారణంగా ఉద్యోగం కోల్పోయే నష్టాలు ఎక్కువయ్యాయని తెలిపింది.