వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్లెక్సీలు పెట్టారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారీ. వైసీపీ పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారని వాటిపై పేర్కొన్నారు. అది నెయ్యే కాదు. పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ అని ఆ ఫ్లెక్స్ లలో పేర్కొన్నారు. ప్లెక్సీలపై మాజీ సీఎం జగన్ తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిడుగురాళ్లలో ప్లెక్సీలు పెట్టడం సర్వత్రా చర్చ జరుగుతోంది.