దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ లో మందకొడిగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు కీలక రంగాల షేర్లలో జోరు కనిపించకపోవడంతో మోస్తరుగా కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. చివరికి 20.46 పాయింట్ల నష్టంతో 84,675.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 3.25 పాయింట్ల నష్టంతో 25,938.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.84గా ఉంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఇండిగో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎటెర్నల్,అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్.బి.ఐ షేర్లు లాభపడ్డాయి.