ఈరోజు సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్ సహా అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో సూచీలు దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 485 పాయింట్ల లాభంతో 84,065 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 25,867 వద్ద ట్రేడింగ్ ముగించింది. సెన్సెక్స్ ఒకానొక దశలో 700 పాయింట్లు లాభపడింది. బీఎస్ఈ లో నమోదిత కంపెనీల విలువ రూ.6లక్షల కోట్లు పెరిగి రూ.473లక్షల కోట్లకు చేరింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.74గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఎస్.బీ.ఐ, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఎటర్నల్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు నష్టపోయాయి.