ప్రజలకు ఈ విధానం అలవాటు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Spread the love

ఇళ్లలో పోగైన చెత్తను కాల్వల్లో పారేయకుండా, తిరిగి అధికారులకు అప్పగిస్తే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి  ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు శ్రీకారం చుట్టారు. నర్సీపట్నం రూరల్ మండలానికి కేటాయించిన ‘స్వచ్ఛ రథాన్ని’ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు తమ ఇళ్లలో సేకరించిన ప్లాస్టిక్, పేపర్లు, ఇనుము వంటి పొడి చెత్తను గోనె సంచుల్లో వేసి ఉంచాలని, స్వచ్ఛ రథం ఊర్లోకి వచ్చినప్పుడు, ఆ చెత్తను వ్యాన్‌లో ఉన్న కాటాలో తూకం వేస్తారని, పేపర్, ఇనుము, ప్లాస్టిక్‌కు నిర్ణయించిన రేట్ల ప్రకారం లెక్కకట్టి, ఆ మొత్తానికి సరిపడా నిత్యావసర వస్తువులను అక్కడికక్కడే తీసుకోవచ్చని స్థానిక ప్రజలకు ఆయన వివరించారు. ప్రజలకు ఈ విధానం అలవాటు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఒకటి రెండు నెలల పాటు అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థాలను, ప్రజలు ఇష్టారాజ్యంగా ఇంటి ముందున్న కాలువల్లో పారేయడం వల్ల అవి పూడుకుపోయి మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని  ఈ సమస్యకు పరిష్కారంగానే స్వచ్ఛ రథాలను ప్రభుత్వం తీసుకొచ్చింది.