ఇప్పుడంటే ఎడాపెడా డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడ్డాం కానీ ఒక దశాబ్దం క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. నగదు రహిత చెల్లింపులకు ప్రజలు అప్పుడు అంత ఆసక్తి కనబరిచే వారు కాదు. అసలు అప్పట్లో నగదు రహిత చెల్లింపులంటే ప్రధానంగా కార్డ్ స్వైపింగ్ మాత్రమే. షాపింగ్ మాల్స్ లేదా పెద్ద షోరూమ్‌లలో PoS (Point of Sale) మిషన్ల ద్వారా కార్డుల ద్వారా చెల్లింపులు జరిగేవి. అదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చిన తర్వాత నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి. సరిగ్గా ఇది మొదలై దశాబ్దం కావస్తోంది. భారతదేశంలో అధికారికంగా ఏప్రిల్ 11, 2016న ఇది ప్రారంభమైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనిని అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ముంబైలో ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖాతాల మధ్య క్యాష్ ట్రాన్స్ఫర్ అత్యంత సులభతరం చేయడం ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
దీనిని ఒక విప్లవాత్మక సాంకేతికతగా చెప్పవచ్చు. దీని ద్వారా కేవలం ఒక మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల నుండి లావాదేవీలు జరపవచ్చు. గతంలో మాదిరిగా ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం UPI ID లేదా QR కోడ్ ని స్కాన్ చేసి వేగంగా డబ్బును పంపడం లేదా తీసుకోవడం సాధ్యమవుతుంది. డిజిటల్ ఇండియా దిశగా భారత్ వేసిన అడుగుల్లోఈ టెక్నాలజీ అత్యంత కీలకమైనది. ప్రస్తుతం ప్రజల నిత్యజీవితంలో ఇది ఒక భాగమైపోయింది. చిల్లర కష్టాలకు చెక్ పెట్టడం…డిజిటల్ పేమెంట్స్ పెరగడం ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. చిన్న కిరాణా కొట్టు నుండి పెద్ద మాల్స్ వరకు ఇలా ప్రతిచోటా ప్రజలు దీనిని వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మార్చి 2026లో యూపీఐ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఆ నెలలో ఏకంగా 22.64 బిలియన్ల లావాదేవీలు జరిగాయి.