ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం

Spread the love

“Prevention is Better than Cure” థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ ను గచ్చిబౌలి  స్టేడియం నుండి తెలంగాణ  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ యోగా చేశారు. అనంతరం ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు పరిశీలించారు. ఈ రోజు వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.  చికిత్సకంటే నివారణ మంచిదనే లక్ష్యంతో ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం అని చెప్పుకోవాలి, ఇది కేవలం వ్యాయామం కాదని సంపూర్ణ జీవన విధానమని అన్నారు. యోగ చేయడం వలన కలిగే ఉపయోగాలు వివరించారు. ఈ ప్రభుత్వం చికిత్సతో పాటు, రోగ నివారణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగర్ వంటి టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 46 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు సుమారు 30 రకాల పరీక్షలతో కూడిన సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలు HPV వ్యాక్సిన్  పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి హెల్త్ కార్డులను అందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. యోగ, నేచరోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేసి ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నాము. ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదని తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.  మనం ఎంత ధనవంతులైనా, ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథానేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా లేదా మరేదైన ఫిజికల్ యాక్టివిటీని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *