పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి తాజాగా విడుదలైన “కాలరే ఎత్తరా…” అనే మాస్ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట విడుదల సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ వేడుకలో దర్శకుడు, నిర్మాతలు, గీత రచయితలు సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ పనితీరుపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ గారు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. ముఖ్యంగా ‘కాలరే ఎత్తరా…’ పాట షూటింగ్ ప్రారంభమైన రోజు ఆయన ఒక స్టెప్ వేసి ప్రాక్టీస్ చేయగానే సెట్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఈలలు వేస్తూ సంబరపడిపోయారు. ఆ సమయంలోనే ఈ పాట థియేటర్లలో ఎంత పెద్ద హంగామా సృష్టిస్తుందో మాకు అర్థమైంది. అభిమానులు ఈ పాటను థియేటర్లో చూస్తే మరింత ఉత్సాహంగా స్పందిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ఇక సినిమాలో నటించిన హీరోయిన్ రాశి ఖన్నా గురించి కూడా దర్శకుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పవన్ కల్యాణ్ గారితో సినిమా అనగానే కథ వినకుండానే వెంటనే అంగీకరించారు. ఆ ఉత్సాహంతోనే ఈ సినిమాలో చాలా ఎనర్జీతో పనిచేశారు. ముఖ్యంగా ‘కాలరే ఎత్తరా…’ పాటలో పవన్ కల్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డాన్స్ చేశారు” అని హరీష్ శంకర్ తెలిపారు. పాటకు సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు Devi Sri Prasad. ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాశారు. గాయకుడు రామ్ మిర్యాల తన ప్రత్యేక శైలిలో ఆలపించారు. ఈ పాట గురించి మాట్లాడిన కాసర్ల శ్యామ్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “ఇంతకు ముందు ‘భీమ్లా నాయక్’ సినిమాకు రెండు పాటలు రాసే అవకాశం వచ్చింది. కానీ పవన్ కల్యాణ్ గారికి సరిపోయే ఒక మాస్ డాన్స్ నెంబర్ రాయలేకపోయాననే చిన్న వెలితి ఉండేది. ఆ లోటు ఈ ‘కాలరే ఎత్తరా…’ పాటతో తీర్చుకున్నానని అనిపిస్తోంది” అని ఆయన చెప్పారు.
ఈ సినిమాలోశ్రీలీల కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే గౌతమి, అశుతోష్ రాణా, నవాబ్ షా, తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రం ఉగాది పండుగ సందర్బంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందు మార్చి 14న ట్రైలర్ విడుదల చేయనున్నారు.