తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అంటే నిర్మాతలు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే టైం. ఏ సినిమా అయినా ఈ పండుగ సమయంలో విడుదలైతే భారీ ఓపెనింగ్స్‌తో పాటు మంచి కలెక్షన్లు వస్తాయనే నమ్మకం ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో నిలవడానికి స్టార్ హీరోల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంది. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా 2027 సంక్రాంతికి నాలుగు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే విడుదల తేదీలపై టాలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది.ఒక్కో నిర్మాత తమ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని పట్టుదలగా ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలే కాకుండా మిడ్ రేంజ్ హీరోల చిత్రాలు కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు థియేటర్ల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. సెలవులు ఎక్కువగా ఉండటం, కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్లకు వెళ్లే సంప్రదాయం ఉండటంతో ఈ సీజన్లో విడుదలయ్యే సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ కారణంగానే పెద్ద హీరోలు తమ సినిమాలను సంక్రాంతికే విడుదల చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఏడు నుంచి ఎనిమిది సినిమాలు ఒకే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో ముందుగానే తన స్థానం ఖరారు చేసుకున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అనిల్ రావిపూడి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వెంకటేష్ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయ్! ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీజర్ ద్వారానే ప్రకటించారు. నిర్మాణ సంస్థ కేవీఎన్ కూడా విడుదల తేదీ విషయంలో పూర్తి నమ్మకంతో ముందుకెళ్తోంది. దర్శకుడు షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందని హామీ ఇవ్వడంతో విడుదల తేదీని మార్చే ఆలోచన లేదని తెలుస్తోంది. చిరంజీవి సినిమా అంటే సహజంగానే భారీ స్థాయిలో థియేటర్లు అవసరం అవుతాయి. అదే సమయంలో మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరోల సినిమాల మధ్య ప్రశాంత్ వర్మ నిర్మాతగా రూపొందుతున్న ‘మహాకాళి’ కూడా సంక్రాంతి రేసులో నిలిచింది. ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతికి కొన్ని రోజుల ముందే విడుదల కావడం వల్ల తొలి వారంలో మంచి వసూళ్లు సాధించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ బలంగా ఉంటే పండుగ రోజుల్లో కూడా మంచి రన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని కూడా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాల సంఖ్య మరింత పెరిగింది. ఒకే రోజున మూడు సినిమాలు విడుదలైతే థియేటర్ల కేటాయింపు నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని సినిమా ప్రారంభ వేడుక రోజే ప్రకటించారు. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న సమయంలో సినిమాను విడుదల చేస్తే కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కూడా పొంగల్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. తమిళనాడులో పొంగల్ సీజన్‌కు ఉండే ఆదరణను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రజనీకాంత్ సినిమా కూడా అదే సమయంలో విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కోసం పోటీ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న అంశం థియేటర్ల లభ్యత. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉండటంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఏపీ, తెలంగాణలోని బి, సి సెంటర్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో నాలుగు లేదా ఐదు స్క్రీన్లు మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకేసారి ఆరు లేదా ఏడు సినిమాలు విడుదలైతే అన్ని చిత్రాలకు సమానంగా థియేటర్లు ఇవ్వడం దాదాపు అసాధ్యం. దీంతో చిన్న, మధ్యస్థాయి సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటీవల సంక్రాంతి సమయంలో విడుదలైన కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, సరిపడా థియేటర్లు దక్కకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా స్క్రీన్ల కొరత కారణంగా ప్రేక్షకుల వరకు పూర్తిస్థాయిలో చేరలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ, విడుదల తేదీలు మాత్రం వరుసగా ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన తేదీలన్నీ అలాగే కొనసాగుతాయా? లేక షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేదా థియేటర్ల సమస్య కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడతాయా? అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. సంక్రాంతి వరకు ఇంకా సమయం ఉండటంతో పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా విడుదల తేదీలు ప్రకటించి చివరి నిమిషంలో మార్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.