సమ్మర్ లోనూ కొనసాగుతున్న షూటింగ్ ల జోరు

Spread the love

సమ్మర్ సీజన్లో స్టార్ట్ అయ్యింది. ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయటికి వెళ్లాలంటేనే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ ఈ మండే ఎండల్ని ఏమాత్రం పట్టించుకోకుండా టాలీవుడ్ నటీనటులు తమ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. కొంతమంది సినిమాల షూటింగ్‌లు స్టూడియోల్లో జరుగుతుండగా, మరికొన్ని సినిమాల కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మించి చిత్రీకరణలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చాలా జోరుగా కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ హీరోలు నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు స్టార్‌లు తమ తమ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటూ టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అగ్ర హీరో నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలిచే 100వ సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇప్పుడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూసరాంబాగ్ ప్రాంతంలో చిత్రీకరణ కొనసాగుతోంది. మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ ఇమేజ్‌కు సరిపోయే భావోద్వేగభరితమైన కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ఇరుముడి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు.

శంకర్‌పల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా కల్కి 2898 ఏడీ 2 రూపొందుతోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ పాల్గొంటున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న గోపీచంద్ 33 సినిమా కూడా అజీజ్ నగర్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యంతో రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తోంది. అఖిల్ నటిస్తున్న తాజా సినిమా లెనిన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో జరుగుతోంది. ఇక శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం భోగి కూడా ప్రస్తుతం ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సాయిదుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా కూడా హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే, మండే ఎండల మధ్య కూడా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు ఆగకుండా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం సినిమా సెట్స్‌తో కళకళలాడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుండటంతో టాలీవుడ్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *