మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు..మిత్రుడికి నివాళులర్పించిన మెగాస్టార్

Spread the love

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై ఆయనకు చిరకాల మిత్రుడైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సానుభూతిని తెలిపారు. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్‌ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో చిరంజీవి మిత్రుడిగా కనిపించారు. ఇక నారాయణరావు భౌతిక కాయానికి చిరంజీవి స్వయంగా వెళ్లి నివాళులర్పించారు. తమ ఇద్దరి సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, తన ప్రియమైన స్నేహితుడికి, సహచరుడికి హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు.

జీవీ నారాయణ రావు మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన సహజమైన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన జీవీ నారాయణ రావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన సృష్టించిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని సినీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *