రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, అపోలో హాస్పిటల్ లో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వు, మాటల్లో వ్యక్తమైన భావోద్వేగం అందరినీ ఆకట్టుకుంది. “ఇప్పటికే ఒక మెగా క్వీన్ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు మరో మెగా క్వీన్‌తో పాటు మెగా వారసుడు కూడా వచ్చాడు” అంటూ చిరు చెప్పిన మాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు. తాతగా మరోసారి ఈ అపురూపమైన క్షణాన్ని అనుభవిస్తున్న ఆనందం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
చిరంజీవి మాట్లాడుతూ… “కవల పిల్లల రాకతో మా కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది. ఈ వార్త తెలిసిన క్షణం నుంచి కొణిదెల కుటుంబం మాత్రమే కాదు, కామినేని కుటుంబ సభ్యులందరూ అపారమైన సంతోషంలో ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టడం నిజంగా భగవంతుడి ఆశీర్వాదం. ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్నో రోజులుగా, ఎన్నో చోట్ల మా ఇంట శుభకార్యం జరగాలని ప్రార్థనలు చేశారు. ఆ దేవుడి దయతో, హనుమాన్ స్వామి కృపతో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ మా ఇంట అడుగుపెట్టారని భావోద్వేగంగా తెలిపారు. అలాగే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. ఈ క్షణాన్ని అభిమానులు నిజంగా పండుగలా జరుపుకుంటున్నారు. వాళ్ల ఆనందానికి ఇప్పుడు హద్దులే లేవు. మా కుటుంబంపై ఇంత ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు అంటూ చిరు తన భావాలను వెల్లడించారు. ఆయన మాటలు వినిపిస్తుండగానే అక్కడున్న మీడియా ప్రతినిధులు, అభిమానులు కూడా ఈ శుభసందర్భాన్ని ప్రత్యేకంగా భావించారు. ఇక కవల పిల్లల జననం గురించి మరో ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. కామినేని కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ముందుగా మగబిడ్డ జన్మించగా, కొన్ని నిమిషాల వ్యవధి తర్వాత ఆడబిడ్డ పుట్టిందని తెలిపారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో ఆనందం మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మెగా ఇంట మరో కొత్త అధ్యాయం మొదలైనట్టుగా అభిమానులు భావిస్తూ, రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.