తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం…కార్యాచరణ వేగవంతం చేయాలి

Spread the love

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణలో వేగం పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్  ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ బ్యారేజ్ ను ఎంత ఎత్తున నిర్మించాలి. ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందనే దానిపై భేటీలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల  ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందని 71.5 కి.మీ మేరకు కెనాల్ పని  జరిగిందని అధికారులు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని ఎక్స్పర్ట్స్  సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు ఒప్పుకుందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని ఇరుపక్షాలకు వీలుగా  150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు వివరించారు. ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌ సహా  తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటిని అందించవచ్చని, అలాగే, తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు వీలుంటుందని సీఎం పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని  వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాల్సిన అంశంపై కేంద్రమంత్రి  కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించాలని కూడా సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం  ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా నీటి పారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *