భారతీయ ఇతిహాసం రామాయణం ఎన్నిసార్లు చూసినా ప్రత్యేకంగా కనిపించే ఈ ఇతిహాసంపై ఇప్పటికే దేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. ఈ సినిమా గ్లిమ్ప్స్ ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ గ్లిమ్ప్స్ ను లాస్ ఏంజిల్స్ లోని ఐమాక్స్ లో స్పెషల్ గా ప్రదర్శించారు. ఇక ఇందులో రాముడి పాత్రలో చేస్తున్న రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ శ్రీరాముడిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. శ్రీరాముడు కేవలం ఒక పురాణపాత్ర మాత్రమే కాదని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజల అంతరాత్మ, ఆరాధ్యదైవమని పేర్కొన్నారు. కష్టసమయాలలో మనిషి స్ఫూర్తి ఎలా ఉండాలో మనకు నేర్పరన్నారు. అలాగే కరుణ, జాలి, త్యాగనిరతి, ధైర్యం, క్షమాగుణానికి నిదర్శనమని పేర్కొన్నారు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారని తెలిపారు. అటువంటి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఏప్రిల్ 2న రానున్న ఈ గ్లిమ్ప్స్ 2 నిమిషాల 38 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపుగా రూ.4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ భారీ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూసేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచమంతా ఈ ప్రాజెక్ట్ తో భారత్ వైపు చూస్తుందన్నారు. ఇందులో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యష్ కనిపించనున్నారు.