తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదన్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించిన అనంతరం పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకోసమే క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.