ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చారిత్రాత్మక రీతిలో జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మొత్తం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తమ సొమ్ము కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రూ. 9,300 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 1,674 కోట్లను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని, దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు భరోసా కల్పించామని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి, రైతులు ఈ ఏడాది సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.