మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా?

Spread the love

సీనియర్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. ప్రస్తుతంఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 10న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇదే హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది చిరంజీవి చేస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ మూవీ. చాలా కాలం తర్వాత ఆయన ఇలాంటి జానర్‌లో నటిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులలో ఇది జోష్ నింపనుంది. జూన్‌ లో రామ్ చరణ్ సినిమా.. ఆ వెంటనే జూలైలో చిరంజీవి సినిమా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది. నిజానికి ‘విశ్వంభర’ చిత్రం ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని బెస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు చాలా జాగ్రత్తగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మెగాస్టార్ కూడా సూచించినట్లు సమాచారం. దీంతో  తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష  హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అలాగే కన్నడ నటి ఆషికా రంగనాథ్  కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ ‘విశ్వంభర’ మాత్రం మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా.. విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా చిత్రాల స్థాయిలో ఈ మూవీ కూడా సంచలనాలు సృష్టించాలని  అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *