ఉన్మాద ఉగ్రమూకలు సరిహద్దులు దాటి భారత సహనాన్ని పరీక్షిస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి దిక్కులు పిక్కటిల్లేలా చేసి చూపించిన ఆ ప్రతిచర్యకు నేటితో ఏడాది. సరిగ్గా ఏడాది క్రితం.. సరిహద్దు అవతల ఉన్న శత్రువును నిలువెల్లా వణికించిన రోజు ఇది. శాంతిని కోరుకునే భారత్ తన శౌర్యాన్ని, పరాక్రమాన్ని కూడా చూపుతుందని మరోసారి నిరూపించింది ఉగ్రవాద మూకలను ఏరివేసి భారత్ తన విశ్వరూపాన్ని చూపించిన ఆ ఘటనే ‘ఆపరేషన్ సింధూర్’. నేటితో ఈ మెరుపు దాడికి ఏడాది పూర్తయింది. ఆనాడు ప్రశాంత కాశ్మీరంలో చిందిన అమాయకుల నెత్తుటికి మన సైన్యం ప్రతీకారం తీర్చుకున్న తీరును చూస్తే నేటికీ ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. ఇది నయా భారత్..శాంతిని పాటిస్తుంది…అవసరమైతే పరాక్రమాన్ని చూపిస్తుంది. ఈ చారిత్రాత్మక విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత ఆర్మీ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం, వైమానిక దళం విడుదల చేసిన సరికొత్త వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న నేపథ్యం ఎంత విషాదకరమైనదో తెలిసిందే. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్ లోయలో ఉగ్రవాదులు చేసిన ఘాతుకం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పర్యాటక ప్రాంతమైన ఆ లోయలో అమాయక ప్రజలను వారి మతం అడిగి మరీ 26 మందిని కాల్చి చంపారు. పసిపిల్లలు, మహిళల కళ్లెదుటే వారి కుటుంబ సభ్యులను కాల్చివేసిన ఆ ఉగ్రవాదుల అరాచకం ప్రతి భారతీయుడి రక్తం మరిగేలా చేసింది. భారత ప్రభుత్వం ఈ మారణహోమానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సరిగ్గా గత ఏడాది మే 7న ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా విడుదలైన వీడియోలలో భారత సైన్యం శత్రువులకు అత్యంత స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉన్న సూత్రధారులను భారత్ గుర్తించి తీరుతుందని గట్టిగా హెచ్చరించింది. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మన వీర జవాన్లు శపథం చేశారు.ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన వీడియోలో భారత్ దేనినీ క్షమించదు అనే నినాదం హైలైట్ గా నిలిచింది. గత ఏడాది మే 7న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన దళాలు విరుచుకుపడ్డాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం ఈ మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే అత్యంత జాగ్రత్తగా లక్ష్యంగా చేసుకున్నారు. ఎటువంటి పౌర నష్టం జరగకుండా అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించిన మన సైన్యం కేవలం ఉగ్రవాదంపై మాత్రమే తన పోరు అని స్పష్టం చేసింది. భారతదేశంపై కన్నేస్తే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది. పహల్గామ్ దాడుల వల్ల మానసిక క్షోభకు గురైన బాధితులకు ఈ ఆపరేషన్ ఒక గొప్ప ఊరటను ఇచ్చింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగిందన్న తృప్తిని ఈ విజయం కలిగించింది. శత్రువు దేశంలోకి చొరబడి మరీ దాడి చేయడం ద్వారా భారత్ తన తెగువను మరోసారి నిరూపించుకుంది. తన ప్రజల రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భారత్ ది జీరో టాలరెన్స్ పాలసీ అని చాటిచెప్పింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని కఠినంగా తేల్చిచెప్పింది. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూనే ఉంది. ఈ విజయం మన రక్షణ దళాల ఆత్మవిశ్వాసాన్ని మరింత శిఖరాగ్రానికి చేర్చింది.