తిరిగి నిలబడతారా? ఆ మాజీ సీఎంల దారెటు?

Spread the love

రాజకీయ ప్రయాణంలో జయాపజయాలు సర్వసాధారణమే అయినా కొన్ని ఓటములు మాత్రం సంచలనంగా మారుతుంటాయి. తాజాగా బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాట స్టాలిన్ ఎదుర్కొన్న పరాజయాలు  ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. సాక్ష్యాత్తూ సిఎంలుగా ఉండి కూడా అసెంబ్లీ సీటు గెలుచుకోలేని పరిస్థితిని చూస్తున్నారు. అయితే వారికి మరో అవకాశం కనిపించే పరిస్థితులు కూడా ఉండడం గమనార్హం. గెలిచిన అభ్యర్థులు తమకు ఉన్న రెండు స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవడం ఇప్పుడు వీరికి ఒక అవకాశంగా కనిపిస్తోంది. అటు తమిళనాడులో విజయ్, ఇటు బెంగాల్‌లో సువేందు అధికారి రెండు చోట్ల గెలవడంతో  సీట్లు ఖాళీ కావడం ద్వారా వీరికి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం వచ్చేలా ఉంది. ప్రజా తీర్పును గౌరవిస్తూనే సభలోకి అడుగుపెట్టేందుకు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి. ఇప్పుడు అందరి దృష్టి ఖాళీ కాబోయే ఆ నియోజకవర్గాల పైనే ఉన్నాయి. దీంతో రాజకీయ చదరంగం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ రెండు చోట్ల విజయం సాధించి రికార్డ్ సృష్టించారు. అటు చెన్నైలోని పెరంబూర్, ఇటు తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లోనూ ఆయన మంచి మెజారిటీలతో గెలిచారు. అయితే ఆయన ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన తిరుచ్చి ఈస్ట్‌ను ఖాళీ చేస్తే అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అవుతుంది. అప్పుడు ఓడిపోయిన స్టాలిన్ మళ్లీ అదే స్థానం నుంచి బరిలోకి దిగి తన సత్తా చాటాతారా అనేది చూడాలి. అయితే ఓటర్లు మరోసారి ఏ వైపు మొగ్గు చూపుతారో అన్నది కూడా ఆసక్తికరమే. ఈ ఒక్క సీటు స్టాలిన్ రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే అవకాశం ఉంది.

మమత ఏం చేస్తుందో?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీని  సువేందు అధికారి మరోసారి ఓడించారు.  సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్,  భవానీపూర్ అనే రెండు కీలక స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆయన, ఈసారి భవానీపూర్‌లోనూ ఆమెపై పైచేయి సాధించి మరోసారి ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఈ రెండు స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉండగా నందిగ్రామ్‌ను వదులుకునే ఛాన్స్ కనిపిస్తోంది. భవానీపూర్‌లో మమతను నేరుగా ఓడించిన ఘనత తనకే దక్కాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల నందిగ్రామ్ స్థానం ఖాళీ అయితే అక్కడ మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. మమత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది చూడాలి.

మమతా బెనర్జీకి కేవలం నందిగ్రామ్ మాత్రమే కాదు మరో ప్రత్యామ్నాయం కూడా సిద్ధంగా ఉంది. హామ్ జనతా పార్టీ నేత హుమాయున్ కబీర్ కూడా రెండు చోట్ల గెలిచి ఇప్పుడు ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. నౌడా, రెజీనా స్థానాల్లో విజయం సాధించిన ఆయన రెజీనాలో భారీ మెజారిటీని దక్కించుకున్నారు. మెజారిటీ ఎక్కువగా వచ్చిన స్థానాన్ని ఉంచుకుని నౌడా నియోజకవర్గాన్ని ఆయన ఖాళీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నందిగ్రామ్‌ లో రిస్క్ వద్దనుకుంటే ఆమె నౌడా వైపు మళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. హుమాయున్ కబీర్ వదులుకునే ఈ స్థానం మమతకు సురక్షితమైన మార్గంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. ఏ స్థానాన్ని ఎంచుకున్నా అక్కడ గెలిచి తీరడం మమతకు ఇప్పుడు కీలకం. దీదీ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఉత్కంఠ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.

స్టాలిన్,  మమతా బెనర్జీ ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించే ఛాన్స్ ఉంటుంది. ఓటమి తర్వాత వచ్చే ఈ అవకాశం వారి రాజకీయ చరిష్మాను మళ్లీ నిలబెడుతుందో లేదో చూడాలి.

ప్రస్తుత తరుణంలో ఓడిపోయిన ముఖ్యమంత్రుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న అసెంబ్లీ అడుగుపెట్టడమే. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వారు ముందుకు వస్తారా లేక ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంత కాలం విరామం తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఒకవేళ వారు పోటీకి వెనుకడుగు వేస్తే కేడర్‌ లో నైతిక బలం సన్నగిల్లే అవకాశం ఉంది.  చట్టసభకు దూరమైతే ప్రజాక్షేత్రంలో వారి ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. బెంగాల్, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదొక కీలక సందర్భంగా నిలిచిపోనుంది. ఇక చివరిగా  ఈ నేతలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఏ నిర్ణయం తీసుకుంటారనేదానికి  కాలమే సమాధానం చెప్పాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *