పద్మ అవార్డులు రావడంపై స్పందించిన మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ 

Spread the love

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో తమకు పద్మశ్రీ రావడంపై సీనియర్ నటుడు మురళీమోహన్ , నట కిరీటీ రాజేంద్రప్రసాద్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందని మురళీమోహన్ అన్నారు. ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం తన పూర్వ జన్మ సుకృతమని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూసిన పద్మ అవార్డు రావడం సంతోషంగా ఉంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఇంకా ఎక్కువని మురళీ మోహన్ ఆనందం వ్యక్తం చేశారు.  ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో మురళీ మోహన్ తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు  అందించారు. కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించడం తన జీవితంలో మర్చిపోలేని రోజని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.