టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకెళ్లిన పూజా హెగ్డే. పరిస్థితి గత కొంతకాలంగా ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆమె సినిమా ఉందంటే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపించేది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ అన్ని భాషల్లో వరుస చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తన అందం, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయితే హీరో హీరోయిన్‌లను ఆకాశానికి ఎత్తేస్తారు. అదే వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క ఫ్లాప్ వచ్చినా కొత్త అవకాశాలు రావడం కష్టమయ్యే ఈ ఇండస్ట్రీలో పూజా హెగ్డే మాత్రం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం దీనికి వేరే కారణం చెబుతున్నారు. పూజా హెగ్డేకు ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె గ్లామర్‌కు ఇంకా మంచి డిమాండ్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్ రోల్స్‌లో పూజా ప్రత్యేకంగా కనిపిస్తుందని దర్శకులు భావిస్తున్నారట. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాలు కూడా చిన్నవి కావు. తమిళ స్టార్ హీరో విజయ్ భారీ చిత్రం జన నాయగన్ లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుకుంది. సీఎం విజయ్ సినిమా కావడంతో అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే పూజా కెరీర్‌కు మళ్లీ బలమైన ఊపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే కాకుండా బాలీవుడ్‌లో కూడా పూజా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన ఆమె నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో పూజా గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటలు, పోస్టర్లు బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఆమె అందాన్ని తెగ పొగుడుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఖాతాలోకి మరో భారీ ప్రాజెక్ట్ చేరబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న భారీ చిత్రం ‘రాకా’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమా తర్వాత బన్నీ మరో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం రావడంతో సోషల్ మీడియాలో మరోసారి ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే బన్నీతో కలిసి పూజా రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‘దువ్వాడ జగన్నాథమ్’ ఆ తర్వాత అల వైకుంఠపురంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ జంట కలిసి నటించబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ స్టైల్ సినిమాలో పూజా ఎలా కనిపిస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.