2012 డిసెంబర్ 16.. దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన చీకటి రోజు. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన ఆ పాశవిక దాడి తలచుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, చట్టాలు మారాయి, నిర్భయ చట్టం అంటూ ఉరిశిక్షలు అమలు చేశారు. ఇన్ని జరిగినా.. నీచుల బుద్ధి మాత్రం మారలేదు. వ్యవస్థలో భద్రతా వైఫల్యాలు మారలేదు. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. అప్పటి నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చేలా మరో ఘోరం వెలుగుచూసింది. సోమవారం రాత్రి తన వర్క్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బాధిత యువతి సరస్వతీ విహార్ బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తోంది. సరిగ్గా అదే టైమ్ లో అక్కడకు వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఆగింది. ఆమె ఆ బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె బస్సులోకి అడుగు పెట్టగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ ఆమెను బలవంతంగా బస్సు లోపలికి లాక్కెళ్లారు. బస్సు కదులుతుండగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సును రాణీబాగ్ నుండి నాంగ్లోయ్ వరకు రోడ్లపై తిప్పుతూ, కదులుతున్న బస్సులోనే ఆ కామాంధులు ఆమెపై అమానుషంగా అత్యాచారం చేశారు. రాత్రంతా ఆమెను నరకయాతనకు గురిచేశారు. రాత్రంతా తనను దారుణంగా హింసించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో తనపై జరిగిన దారుణం గురించి ఆరోపించింది. ఈ ఘోరమైన ఘటన తర్వాత, నిందితులు బాధితురాలిని నంగ్లోయ్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి బస్సుతో సహా పరారయ్యారు. తీవ్ర ఆవేదనలో ఉన్న బాధితురాలు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన రాణిబాగ్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు.దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించడమే కాకుండా, నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత బస్సును పోలీసులు గుర్తించారు. అనంతరం బస్సును సీజ్ చేసి డ్రైవర్, కండక్టరును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని జైలుకు తరలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తరువాత చర్యలు చేపట్టారు.
2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయ ఘటన వంటిదే ఇప్పుడు పునరావృతం అవడం కలకలం రేపుతోంది. దేశాన్ని శాసించే పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఎంతో మంది వీఐపీలు ఉండే అత్యంత రద్దీ ప్రదేశమైన దేశ రాజధాని నడిబొడ్డున ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మరోసారి ఇలాంటి దారుణం జరగడం నేర ప్రవృత్తి ఏస్థాయికి చేరిందో అర్ధమవుతోంది. ఈ ఘటన తరువాత ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న.. రాత్రి పూట ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో మహిళలకు రక్షణ ఏది? అని. ఈ రోజుల్లో దూర ప్రయాణాలకు చాలామంది ఏసీ స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కానీ వాటిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు.స్లీపర్ క్యాబిన్లకు కర్టెన్లు ఉండటం వల్ల లోపల ఏం జరుగుతుందో బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ప్రభుత్వ బస్సుల్లో ఉన్నట్లుగా, చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పని చేసే సీసీటీవీ కెమెరాలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి రాత్రి పూట స్పష్టంగా రికార్డ్ చేయలేవు. బస్సు డ్రైవర్లు, క్లీనర్ల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండానే చాలా ట్రావెల్స్ సంస్థలు వారిని విధుల్లోకి తీసుకుంటున్నాయి.
నిర్భయ ఘటన తర్వాత కమర్షియల్ బస్సుల్లో పానిక్ బటన్లు, జీపీఎస్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తెచ్చింది. కానీ వాస్తవానికి ఆ నిబంధనలు కాగితాలకే పరిమితం అయ్యాయి అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. బస్సుల్లో అమర్చిన ఎన్ని కెమెరాలు నిజంగా పనిచేస్తున్నాయి? రాత్రి పూట ప్రయాణించే ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్, క్లీనర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందా? హైవేలపై తిరిగే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు అనుమానాస్పదంగా తిరిగే బస్సులను ఎందుకు ఆపి తనిఖీ చేయట్లేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నంత కాలం ఇలాంటి దారుణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.ఇప్పుడు ఈ కేసులోనైనా బాధితురాలికి తక్షణ న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు , ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.