చార్మి‌తో రిలేషన్ పై ఓపెన్ అయిన పూరి.!

Spread the love

Puri Charmi Relation: ఒకప్పుడు టాలీవుడ్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక బ్రాండ్‌గా వెలిగారు. ఇప్పటికీ ఆయనను ఆరాధించే అభిమానులు కోకొల్లలు. ఒకానొక దశలో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించిన పూరి, ప్రస్తుతం ఫ్లాప్‌ల పరంపరలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన చివరి రెండు చిత్రాలైన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేస్తున్న పూరి, ఈ ప్రాజెక్ట్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా, పూరి కమ్‌బ్యాక్ గురించి ఎంత చర్చ జరుగుతోందో, అదే స్థాయిలో ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా హీరోయిన్ ఛార్మితో తన రిలేషన్‌షిప్‌ గురించి కూడా ప్రచారం జరుగుతోంది.

59 ఏళ్ల పూరి జగన్నాథ్‌కు 29 ఏళ్ల క్రితం వివాహమైంది, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన కుమారుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, గత కొన్నేళ్లుగా పూరి, హీరోయిన్ ఛార్మితో ప్రేమ సంబంధంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది.హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న 38 ఏళ్ల ఛార్మి, పదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. 2015లో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం నుంచీ ఆమె పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ‘రోగ్’ సినిమా నుంచి వీరి ప్రయాణం కొనసాగుతోంది. బయట కూడా పూరి, ఛార్మి తరచూ కలిసి కనిపిస్తుండటంతో, వారి మధ్య ‘సంథింగ్ సంథింగ్’ ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి.

ఛార్మికి ఇంకా పెళ్లి కాకపోవడంతో, పూరి ఆమె ప్రేమలో మునిగి, కుటుంబానికి దూరమయ్యారని, త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.అయితే, ఈ గాసిప్స్‌పై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పూరి జగన్నాథ్ ఎట్టకేలకు స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

“ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసు. దాదాపు 20 సంవత్సరాలుగా మా మధ్య బలమైన స్నేహం ఉంది. మేమిద్దరం కలిసి అనేక సినిమాలకు పనిచేశాం. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ బంధం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కారణం ఛార్మికి ఇంకా పెళ్లి కాకపోవడమే. ఆమె సింగిల్ గా ఉండటం వల్లే ఇలాంటి వార్తలు బలంగా వ్యాపిస్తున్నాయి. ఒకవేళ ఆమెకు 50 ఏళ్లు ఉండి, వేరే వ్యక్తితో పెళ్లి జరిగి ఉంటే, ఈ విషయం ఇంత చర్చకు వచ్చేది కాదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది శాశ్వతంగా ఉంటుంది” అని పూరి తేల్చి చెప్పారు.

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి ‘బెగ్గర్’ అనే పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ, ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా, ఇటీవల కరూర్ తిక్కిసలాట ఘటన కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ రోజు (గురువారం) చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్‌ను పూరీ కనెక్ట్స్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. Puri Charmi Relation.

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని, ‘యానిమల్’ సినిమాకు జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాకి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడంతో, పూరి – విజయ్ సేతుపతి కాంబినేషన్ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.