
Nagarjuna’s King 100: అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో వందవ సినిమా (నాగ్ 100) కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నిశ్శబ్దంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త దర్శకుడు ఆర్. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పైన నిర్మిస్తున్నారు. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకంగా నిలవాల్సిన ఈ 100వ సినిమా విషయంలో నాగార్జున ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
టబు ఔట్… కారణం ఇదేనా?
ఈ చిత్రంలో నాగార్జున సరసన నటి టబు నటించనున్నారనే వార్తలు గతంలో వచ్చాయి. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకులను అలరించిన వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం టబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, టబు వైదొలిగారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
నయనతారకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్?
ఇదే సమయంలో, చిత్ర బృందం టబు స్థానంలో స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలని భావిస్తున్నట్టు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నయనతార అగ్ర హీరోలతో వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య నాగార్జున 100వ చిత్రంలో నటించేందుకు నయనతార భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, నాగార్జున, నయనతార గతంలో ‘బాస్’ చిత్రంలో జోడీగా నటించారు.
మనం తర్వాత మళ్లీ అక్కినేని త్రయం?
కోలీవుడ్ దర్శకుడు ఆర్. కార్తీక్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారనే సమాచారం అక్కినేని అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అక్కినేని కుటుంబానికి ‘మనం’ చిత్రం తర్వాత మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచే ఈ కాంబినేషన్ నిజమైతే, అభిమానులకు అది పెద్ద పండుగే అవుతుంది. Nagarjuna’s King 100.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలయికగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్‌లో ‘లాటరీ కింగ్’ అనే పదం ఉండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నాగార్జున ఒక విజయవంతమైన వ్యాపారవేత్త పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మొత్తం మీద, నాగ్ 100 మూవీ పట్ల ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నా, టబు తప్పుకున్నారనే వార్త మాత్రం కొంత నిరాశను మిగిల్చింది.