సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహారాజ రవి తేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై నిర్మాత సుధాకర్ చెరుకూరి సంతృప్తి వ్యక్తం చేశారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని ఆయన తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని, మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని సుధాకర్ చెరుకూరి చెప్పారు. సంక్రాంతి సెలవులు పొడిగించబడటం వల్ల అన్ని ఏరియాల్లో సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోందని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన రిటర్న్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సంతృప్తిగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ప్రత్యేకమైన సమయం అని పేర్కొన్న ఆయన, ఈ పండుగ కాలంలో కుటుంబ సమేతంగా చూసే సినిమాలకే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతారని మరోసారి రుజువైందన్నారు. అదే ఉద్దేశంతో రవితేజ కెరీర్‌లో తరచూ కనిపించే యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా… ఈసారి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవ్వాలనుకున్నామని చెప్పారు. పండుగ వాతావరణానికి సరిపోయేలా, అందరూ కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా చేయాలన్న ఆలోచనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు.మొత్తంగా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. ఈసారి విడుదలైన అన్ని సంక్రాంతి సినిమాలు మంచి ప్రదర్శననే కనబరిచాయని అన్నారు. సాధారణంగా సంక్రాంతి చిత్రాలు రెండో వారం నుంచి మరింత పికప్ అవుతాయని, అదే కారణంగా తరువాతి వారాల్లో కూడా కలెక్షన్లు నిలకడగా కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడిన సుధాకర్ చెరుకూరి, మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్, ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా పూర్తైన తర్వాత మొదలవుతుందని చెప్పారు. ఈ చిరంజీవి సినిమా ఒక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని తెలిపారు. ఇక ‘ది ప్యారడైజ్’ సినిమా విషయానికి వస్తే… ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సాఫీగా సాగుతోందని, దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యిందని వెల్లడించారు. ఈ సినిమాలో ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లలో చిత్రీకరిస్తున్నామని చెప్పారు. కథ, మేకింగ్ పరంగా ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రేక్షకులు తప్పకుండా ఒక డిఫరెంట్ అనుభూతిని పొందుతారని ధీమా వ్యక్తం చేశారు.