సీనియర్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. అయితే ఆ సినిమాల్లో త్రివిక్రమ్ దర్శకుడిగా కాకుండా రచయితగా పనిచేశారు. ఆయన రాసిన మాటలు, వెంకటేష్ టైమింగ్ కలిసిపోవడంతో ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. అందుకే ఇప్పుడు మొదటిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనున్నారు.
ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ను ముందుగా సంగీత దర్శకుడిగా అనుకున్నారు. అయితే తాజాగా థమన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ – తమన్ కాంబినేషన్ అంటే ఇప్పటికే హిట్ ఫార్ములాగా మారింది. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో తమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ మార్పు జరిగింది. మరోసారి వీరి కాంబినేషన్ లో అదిరే మ్యూజిక్ గ్యారంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్, తమన్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించారట. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.