భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబంలో పెళ్లి సందడి వైభవంగా ప్రారంభమైంది. సచిన్ కొడుకు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. తన స్నేహితురాలు సానియా చందోక్ ను అతను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు అంబానీ కుటుంబం ఆతిథ్యమివ్వడం విశేషం. ఈ వేడుకకు అంబానీ కుటుంబం ప్రత్యేకంగా హాజరై కాబోయే జంటను ఆశీర్వదించింది. సచిన్ టెండూల్కర్, అంబానీ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా మంచి స్నేహబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీతా అంబానీ, ముఖేశ్ అంబానీ, ఆకాశ్-శ్లోకా అంబానీ, అనంత్-రాధికా అంబానీ దంపతులు ఈ వేడుకలో భాగమయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.