సినిమాలు, రాజకీయాల్లోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. తాజాగా ఆయన జపాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక యుద్ధకళ ‘కెంజుట్సు’ (Kenjutsu) లో అధికారికంగా ప్రవేశం పొందడమే కాకుండా, ‘సోగో బుడో కన్‌రి కై’ సంస్థ నుండి ‘ఫిఫ్త్ డాన్’ (5th Dan) పురస్కారాన్ని అందుకున్నారు. జపాన్ బయట చాలా అరుదుగా లభించే ఈ గౌరవాన్ని పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్‌కు ఉన్న అంకితభావానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనను “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే బిరుదుతో సత్కరించింది. సోకే మురమత్సు సెన్సై ఆధ్వర్యంలోని ప్రఖ్యాత ‘టకేదా షింగెన్ క్లాన్’లోకి ఆయనకు ప్రవేశం లభించడం విశేషం. ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ పర్యవేక్షణలో ఆయన పొందిన శిక్షణ మరియు సాధన ఈ అంతర్జాతీయ గుర్తింపునకు ప్రధాన కారణమయ్యాయి.కెరీర్ ప్రారంభం నుండే కరాటే, కెండో వంటి యుద్ధకళల్లో రాటుదేలిన పవన్ కళ్యాణ్, తన సినిమాల్లో సైతం వాటిని ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, తన అభిరుచిని కొనసాగిస్తూ ఈ స్థాయి గౌరవాన్ని అందుకోవడం అభిమానులకు గర్వకారణంగా నిలిచింది. నటుడిగా, ప్రజా నాయకుడిగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మార్షల్ ఆర్టిస్ట్‌గా ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం సినిమా రంగంలోకి రాకముందే ప్రారంభమైంది. ముఖ్యంగా చెన్నైలో ఉన్న రోజుల్లో ఆయన కరాటే, ఇతర యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. శరీర సాధనతో మాత్రమే కాకుండా, జపాన్ సామురాయి సంప్రదాయాలు, మార్షల్ ఆర్ట్స్ తత్వశాస్త్రం పట్ల కూడా పవన్ లోతైన అవగాహన పెంచుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.