విభిన్న కథాంశాలున్న చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలతో అలరించే నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రంకు సంబంధించి ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే పేరును ఖరారు చేస్తూ నేడు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కనకరాజు అనే వ్యక్తి కోసం కొరియా పోలీసులు ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌ను చిత్రహింసలు పెట్టడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇంతలో పౌర్ణమి రాత్రి కనకరాజు (వరుణ్ తేజ్) ఓ ఆత్మ ఆవహించిన వాడిలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేస్తాడు. చివర్లో అతను కొరియన్ భాషలో ‘నేను తిరిగొచ్చాను’ అని చెప్పడం, “ఈ కనకరాజు మన కనకరాజు కాదు” అంటూ ఫొటోగ్రాఫర్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో థ్రిల్ కలిగిస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది.