సహజీవనంలో ఉన్న వారికి కుటుంబ హోదా..సెన్సస్ పై కేంద్రం కీలక నిర్ణయం

Spread the love

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో సహా జీవనం సాగిస్తున్న జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలా కాలం నుండి కలిసి ఉంటున్న జంటలకు ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు సెన్సస్ ప్రక్రియ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 16వ సెన్సస్ జరగనుంది. ఏప్రిల్ 1 నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు దశల్లో దీనిని చేయనున్నారు. మొదటి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్ చేపట్టనున్నారు. అధికారులు ఇంటి ఇంటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరించనున్నారు. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. ఇక ప్రజల నుండి వివరాలను సేకరించే క్రమంలో పలు ప్రశ్నలు అడగనుంది. గతంలో కంటే ఈసారి కొన్ని ప్రశ్నలను అడిగి వివరాలను తెలుసుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు, మారుతున్న సాంకేతిక అలవాట్లు మరియు ఆర్థిక స్థితిగతులను మరింత స్పష్టంగా  అర్థం చేసుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలలో కుటుంబ యజమాని ఎవరు? ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు? ఇంట్లో ఉన్న కనీస వసతులు త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అంశాలతో పాటు, కుటుంబ సభ్యుల ఎడ్యుకేషన్ సహా పలు అంశాలు  అలాగే ప్రస్తుతం ప్రజల జీవితాల్లో భాగమైన సాంకేతిక అంశాలను అడగనున్నారు. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వాడుతున్నారా? త్రాగునీరు, తృణ ధాన్యాల వినియోగం సహా పలు కీలక అంశాలను అడగనున్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *