సమాజంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగంపై నటి రోహిణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు తప్పుదారి పట్టకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులు , కుటుంబంపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. స్నేహితుల మెప్పు కోసం చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని చిన్నతనం నుంచే పిల్లలకు వివరించాలని, వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే గమనించి ప్రేమతో సరిదిద్దాలని సూచించారు. సమాజంలో చెడును నియంత్రించడానికి పోలీసులు కృషి చేస్తున్నప్పటికీ, మన వంతు బాధ్యతగా రాబోయే తరాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, పిల్లలు విన్నా వినకపోయినా మంచి విషయాలను పదే పదే చెప్పడం మానకూడదని ఆమె పిలుపునిచ్చారు.
స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపాలంటే పెంపకంలోనే మార్పు రావాలని రోహిణి అభిప్రాయపడ్డారు.కేవలం అమ్మాయిలకే ఇంటి పనులు నేర్పించడం కాకుండా, అబ్బాయిలకు కూడా వంట ఇతర పనులు నేర్పించాలని, “మీరిద్దరూ సమానంగా కలిసి పనిచేయాలి” అని తల్లి చెప్పి పెంచాలని సూచించారు.మహిళలను “జీతం లేని శ్రామికులు”గా చూడకూడదని, ప్రతి మహిళ చదువుకుంటేనే సమాజంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె పేర్కొన్నారు. అందరూ కలిసి సమానంగా నడిచే సమాజం రావాలని, అభ్యుదయ భావాలు మాట్లాడే వారు ముందుగా తమ ఇంట్లో ఉన్న మహిళల శ్రమను గుర్తించాలని ఆమె ఈ సందర్భంగా హితవు పలికారు.