అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజాను పునర్నిర్మించేందుకు ‘బోర్డు ఆఫ్ పీస్’ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ప్రతిపాదించిన అంతర్జాతీయ వేదిక. కాగా, ఇందులో భాగం కావాలని భారత్ కు ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే ఈ ప్రతిపాదనపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ బోర్డులో భాగం కావాలని అమెరికా గవర్నమెంట్ నుండి భారత్ కు ఆహ్వానం అందిందని, అయితే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు,ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ బోర్డుకు సంబంధించి ఫిబ్రవరి 19న జరిగే తొలి సమావేశానికి భారత్ పాల్గొంటుందా, లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదన్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలకు తాము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ రాజకీయ జీవితంపై గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దానిపై రణధీర్ జైస్వాల్ స్పందించారు. తాను ఆ వీడియో చూడలేదని అయితే ఆ వీడియో నిజంగా ఉంటే.. అది నిజమైనా, అబద్ధమైనా దానిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.