వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన వాటర్ వే హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల మధ్య భగ్గుమంటోంది. ప్రపంచవ్యాప్తంగాసప్లై అయ్యే చమురులో దాదాపు 20 శాతం వాటా 30 కిలోమీటర్ల పైచిలుకు ఉండే ఈ చిన్న జలసంధి మీదుగానే సాగుతుంది. అక్కడ ఏ చిన్న అలజడి రేగినా ప్రపంచం మొత్తంపై దాని ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పలు దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోతుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఇరాన్ తన అతిపెద్ద ప్రొటెక్టీవ్ షీల్డ్ గా మార్చుకుంది. పశ్చిమ దేశాలతో, ముఖ్యంగా అమెరికా ,ఇజ్రాయెల్ కూటమితో ఇరాన్ కు ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే. అయితే, ప్రత్యక్ష యుద్ధానికి దిగితే జరిగే నష్టం కంటే, ‘ఆయిల్ సప్లై’’ను అడ్డుకుంటామనే హెచ్చరికతోనే ఇరాన్ ఇన్నాళ్లూ వారిని కట్టడి చేస్తూ వచ్చింది. ఈ జలసంధిని మూసివేయడం లేదా అక్కడ నేవీ ఆపరేషన్స్ పెంచడం ద్వారా అమెరికా ఆర్థిక ప్రయోజనాలపై గురిపెట్టడమే ఇరాన్ మెయిన్ టార్గెట్.
ఇక ఈ ఆపరేషన్ మొత్తానికి సూత్రధారి, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావికాదళాధిపతి అలీరెజా తంగ్సిరి. ఇక్కడ కార్యకలాపాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటూనే, నావికాదళాన్ని ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషి ఇరాన్ కు పెద్ద బలాన్ని ఇచ్చింది.అయితే, ఇప్పుడు అటువంటి వ్యూహకర్త ప్రాణాలతో లేరు. అలీరెజా తంగ్సిరి మరణం ఇరాన్ నావికాదళానికి మాత్రమే కాదు, ఆ దేశ వ్యూహాత్మక బలానికి కూడా పెద్ద లోటు. ఆయన లేని లోటును ఇరాన్ ఎలా భర్తీ చేస్తుంది? హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కోల్పోతుందా? లేదా ఆయన తర్వాత వచ్చేవారు అదే దూకుడును కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన బందర్ అబ్బాస్ పోర్టును టార్గెట్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని ఇన్నాళ్లూ తన కంట్రోల్ లో ఉంచుకున్న ప్రధాన శక్తిని అంతం చేయడం ద్వారా, ఇరాన్ నేవీని గట్టి దెబ్బకొట్టింది. తంగ్సిరి మరణం కేవలం ఒక వ్యక్తి కోల్పోవడం మాత్రమే కాదు, ఇరాన్ వ్యూహాత్మక ప్రొటెక్షన్ షీల్డ్ కు బీటలువారడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధిని ఒక అజేయమైన కోటలా మార్చిన ఘనత తంగ్సిరిదే.
అబ్బాస్ కేంద్రంపై దాడి జరగడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. అత్యాధునిక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, మిస్సైల్ ప్రొటెక్షన్ షీల్డ్స్ ఉన్న ఈ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ మిస్సైల్స్ చొచ్చుకురావడం ఇరాన్ నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇక హార్ముజ్ జలసంధి మీదుగా సాగే అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇరాన్ తన పట్టును నిరూపించుకోవడానికి చమురు ట్యాంకర్లపై దాడులకు దిగుతుందా లేదా జలసంధిని మూసివేస్తుందా అన్న ఆందోళన ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఒకవేళ ఇరాన్ తీవ్రంగా స్పందిస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతుంది. తంగ్సిరి మరణం తర్వాత ఇరాన్ ఎవరిని కమాండర్ గా ఎవరిని నియమిస్తుంది? తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇరాన్ ఏ వ్యూహాన్ని అమలుచేయబోతోంది? యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, హార్ముజ్ జలసంధి పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.