గత దశాబ్దంన్నర నుండి టెక్నాలజీ మీద ప్రపంచం ఏ స్థాయిలో ఆధారపడుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈరోజు స్మార్ట్‌ఫోన్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ మీదనే ప్రతి పని అనుసంధానమై నడుస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది దాదాపుగా ప్రపంచంలోని ప్రతి రంగంలోకి చొచ్చుకెళ్లింది. ఇదంతా శాటిలైట్ల ద్వారా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95 శాతం నుంచి 97 శాతం వరకు సముద్ర గర్భంలో కొన్ని వేల కిలోమీటర్ల మేర పరిచిన ‘ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల’ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం , హార్మూజ్ జలసంధి ప్రాంతాలు ఈ డిజిటల్ ట్రాఫిక్‌కు అత్యంత కీలకమైన జంక్షన్లు. ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను కలిపే ప్రధాన కేబుల్ వ్యవస్థలన్నీ ఈ మార్గం నుండే వెళ్తాయి. ఇప్పుడు ఇరాన్ తన హెచ్చరికల ద్వారా సరిగ్గా ఈ ప్రాంతంపై దెబ్బకొట్టాలని చూస్తోంది. 2026 ఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఒకవేళ అమెరికా దళాలకు గల్ఫ్ దేశాలు సహకరిస్తే దానికి ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. సముద్ర గర్భంలోని కేబుళ్లను కట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్లను స్తంభింపజేయడం ప్రత్యక్షంగా చేసుకున్న యుద్ధం కంటే తక్కువేమీ కాదు. ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టేసే ఈ డిజిటల్ దాడి. ఈ ముప్పు గనుక సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇక భారతదేశం విషయానికి వస్తే, మన దేశం నుంచి అమెరికా , యూరప్ దేశాలకు వెళ్లే డేటా ట్రాఫిక్‌లో మూడో వంతు ఈ రెడ్ సీ మార్గం గుండానే వెళ్తుంది. భారత్ అగ్రగామిగా ఉన్న ఐటీ, సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్ దీనివల్ల కుప్పకూలే ప్రమాదం ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ లుగా మారుతున్నాయి. భారీ డేటా సెంటర్లు అక్కడ ఏర్పాటయ్యాయి. ఇరాన్ చర్యలతో దాని ప్రభావం ఈ గ్లోబల్ టెక్ హబ్ లపై నేరుగా పడుతుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థ (SWIFT) ఈ కేబుళ్లపైనే ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ పేమెంట్స్ అన్నీ నిలిచిపోతాయి. ఈ కేబుళ్లు తెగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. క్లౌడ్ సర్వీసులు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోతాయి.సముద్రం అడుగున ఉండే ఈ కేబుళ్లను తెంపేయడం తేలికే అయితే వాటిని పునరుద్ధరించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. వీటిని సరిచేయడానికి అత్యాధునిక సాంకేతికత కలిగిన ప్రత్యేక ‘కేబుల్ రిపేర్ షిప్’ లు కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, ఎర్ర సముద్రం వంటి ప్రమాదకర ప్రాంతాల్లోకి ఈ నౌకలు వెళ్లడం దాదాపు అసాధ్యమే. ఒకసారి కేబుల్ తెగితే అది నెలల తరబడి పునరుద్ధరణకు నోచుకోకపోవచ్చు.పరిస్థితి తీవ్రతను గమనించిన భారత టెలికాం శాఖ ఇప్పటికే రంగంలోకి దిగింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ టెలికాం సంస్థలతో ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించింది. ఒకవేళ పశ్చిమ ఆసియా మార్గం మూసుకుపోతే, ప్రత్యామ్నాయంగా డేటా రీ రూటింగ్ తూర్పు మార్గాల ద్వారా అంటే సింగపూర్ వైపుగా డేటాను ఎలా మళ్లించాలి అనే అంశాలపై సమాలోచనలు చేస్తోంది. కానీ, తూర్పు మార్గాలపై ఒత్తిడి పెరిగితే ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సముద్ర గర్భంలో వేల మైళ్ల కేబుళ్లను సొంతంగా వేసుకున్నాయి. ఇప్పుడు వాటి రక్షణ కోసం ప్రైవేట్ సెక్యూరిటీని లేదా ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నాయి. ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనేది ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా మారింది. టెక్నాలజీ ఎంత పెరిగినా, సముద్ర గర్భంలోని కేబుళ్లకు భౌతిక రక్షణ కల్పించడం దాదాపు అసాధ్యం. వేల కిలోమీటర్ల పొడవునా కాపలా కాయడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే, చర్చల ద్వారా ఇరాన్ ను అటువంటి ఎటాక్ లను చేయకుండా చేయడమే ప్రపంచ దేశాల ముందున్న ఏకైక మార్గం. వీటిని రక్షించుకోలేకపోతే ప్రస్తుత ఆధునిక ప్రపంచం దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.