బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు పూర్తి.. భారత్ నుండి హాజరైన మంత్రి జై శంకర్ 

Spread the love

ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె  అంత్యక్రియలు నేడు  ఢాకాలో పూర్తయ్యాయి. ఆమెకు చివరగా  వీడ్కోలు పలికేందుకు భారీగా  అభిమానులు, ప్రజలు తరలిరావడంతో మానిక్ మియా అవెన్యూ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో ఢాకా చేరుకున్న జైశంకర్ ఖలీదా జియా కుమారుడు, బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్‌ ను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత సంతాప సందేశాన్ని ఆయనకు ఇచ్చారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు జైశంకర్ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. 

ఢాకాలోని నేషనల్  పార్లమెంట్ భవనం సమీపంలో ఉన్న మానిక్ మియా అవెన్యూలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్-ఎ-జనజా) నిర్వహించారు. అనంతరం, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే షేర్-ఎ-బంగ్లా నగర్‌లోని చంద్రినా ఉద్యాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల ప్రతినిధులు హాజరయ్యారు.