
Trump vs India China Russia: అమెరికా, చైనా, రష్యా, భారత్ – ఈ నాలుగు దేశాల మధ్య ఇప్పుడు కొత్త ఆట మొదలైంది. ఇప్పటివరకు చైనాను కట్టడి చేయడానికి భారత్‌ను మిత్రదేశంగా చేసుకున్న అమెరికా, ట్రంప్ పాలనలో కొత్త విధానాలతో భారత్‌పై ఆంక్షలు, ఒత్తిడులు పెంచుతోంది. ఈ నిర్ణయాలు భారత్‌ను చైనా, రష్యాకు మరింద దగ్గర చేస్తున్నాయా? ట్రంప్ ఒకటి అనుకుంటే ఇప్పుడు ఒకటి జరుగుతోందా..? ప్రధాని మోదీ చైనా పర్యటన, అజిత్ దోవల్ రష్యా టూర్, రష్యా అణు ఒప్పందం రద్దు – ఈ పరిణామాలు గ్లోబల్ పవర్ చేయి మారుతోందనే సంకేతాలు ఇస్తున్నాయా ? కొద్ది రోజుల్లో అమెరికాకు ఈ మూడు దేశాలు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
గత దశాబ్దంలో అమెరికా-భారత్ సంబంధాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక మిత్రత్వంగా బలపడ్డాయి. ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ, క్వాడ్ వంటి వేదికల ద్వారా భారత్‌ను చైనా కట్టడికి కీలక భాగస్వామిగా అమెరికా చూసింది. కానీ, ట్రంప్ పాలనలో ఈ సమీకరణలు మారుతున్నాయి. ట్రంప్ భారత్‌పై వాణిజ్య ఆంక్షలు విధించడం, రష్యాతో రక్షణ ఒప్పందాలపై ఒత్తిడి పెంచడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. భారత ఉత్పత్తులపై 25% సుంకాలు విధించే ప్రతిపాదనలు, H-1B వీసా పరిమితులు భారత్‌ను అమెరికాకు దూరం చేస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో భారత్ చైనాకు దగ్గరవుతోందనే మాట వినిపిస్తోంది. దీనికి ట్రంప్ తలతిక్క నిర్ణయాలు కారణమని చెబుతున్నారు. దీనిని రుజువు చేస్తూ అమెరికా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా భారత్ లాంటి కీలక మిత్రదేశాన్ని దూరం చేయడం అమెరికాకు హానికరం అని ట్రంప్‌ను హెచ్చరించారు. అంటే ట్రంప్ ఏదో అనుకుంటే మరెదో జరుగుతోందని అర్థమవుతోంది. అంటే ట్రంప్ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టు అవుతుందని అంటున్నారు.
భారత్-చైనా సంబంధాల్లో కొత్త మలుపు ఏంటి..?
భారత్-చైనా సంబంధాలు గతంలో సరిహద్దు వివాదాలు, ఆర్థిక పోటీతత్వం, పాకిస్తాన్ అంశంతో ఒడిదొడుకులతో సాగాయి. అయితే, ట్రంప్ విధానాలు భారత్‌ను చైనాతో దగ్గర చేస్తున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది, ఈ పర్యటన ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు శాంతి చర్చలకు కీలకం కానుంది భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి వేదికల్లో భారత్-చైనా సహకారం పెరుగుతోంది. అమెరికా ఆంక్షలతో భారత్ తన విదేశాంగ విధానాన్ని మల్టీ అలైన్ మెంట్ వైపు మళ్లిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2024లో భారత్-చైనా వాణిజ్యం 130 బిలియన్ డాలర్లకు చేరింది, ఇది గత ఐదేళ్లలో 25% పెరిగింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో భారత్ తన దారిని మార్చుకుంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా గత వ్యూహానికి సవాల్‌గా మారుతున్నాయి. అంటే అమెరికా గత పాలకుల శ్రమంతా ట్రంప్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని భావించవచ్చు.
అటు ఇటీవల పరిణామాలతో రష్యాతోను భారత్ చర్చలు ముమ్మరం చేసింది. భారత్-రష్యా సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ట్రంప్ పాలనలో అమెరికా భారత్‌పై ఒత్తిడి పెంచడంతో, భారత్ రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం వంటి విషయాల్లో కీలకంగా మారనుందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనసాగిస్తూ, రష్యాతో వాణిజ్యాన్ని 2024లో 65 బిలియన్ డాలర్లకు పెంచింది, ఇందులో 70% ఇంధన దిగుమతులే ఉన్నాయి. ఈ పర్యటన భారత్ రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తోందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
అటు అమెరికా తీరుతో రష్యా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా కోల్డ్ వార్ సమయంలో చేసుకున్న ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల యూరప్‌లో రెండు అణు-సామర్థ్యం గల జలాంతర్గాములను మోహరించాలని అమెరికా ప్రణాళిక వేసింది, దీనిని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా చర్యలు ప్రపంచ శాంతిని దెబ్బతీస్తాయి. ఈ ఒప్పంద రద్దు తమ తొలి ప్రతిస్పందన మాత్రమే అని రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు అమెరికా-రష్యా సంబంధాలను మరింత దిగజార్చాయి, భారత్ రష్యాతో సహకారాన్ని పెంచడానికి అవకాశం కల్పించాయి.
ట్రంప్ విధానాలు చైనా, రష్యాలతో భారత్‌ను దగ్గర చేస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. బ్రిక్స్, SCO, G20 వంటి వేదికల్లో ఈ మూడు దేశాల సమన్వయం పెరుగుతోంది. బ్రిక్స్ సమావేశంలో భారత్, చైనా, రష్యా కొత్త ఆర్థిక, రక్షణ సహకార ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాయి. అమెరికా ఆంక్షలు, టారిఫ్ వార్ ఈ మూడు దేశాలను ఒకే వేదికపైకి తెస్తున్నాయి. భారత్-చైనా-రష్యా మధ్య డీడాలరైజేషన్ చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ ఇది సాధ్యమైతే ఈ కూటమి అమెరికా ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. అంటే ప్రపంచ దేశాల పెద్దనగా అమెరికా హోదా పోవడం ఖాయం.
భారత్, చైనా, రష్యా ఒకే దిశలో అడుగులు వేస్తే, గ్లోబల్ జియోపాలిటిక్స్‌లో శక్తి సమీకరణలు పూర్తిగా మారతాయి. దీనికి మోదీ చైనా పర్యటన, అజిత్ దోవల్ రష్యా టూర్ వంటివి వ్యూహాత్మక సంకేతాలుగా చూస్తున్నారు. ట్రంప్ విధానాలు చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకోవాలనే అమెరికా లక్ష్యాన్ని చెడగొడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2025లో భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు 10 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో, చైనాతో వాణిజ్య సహకారం పెరగడం అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని బలహీనపరుస్తోంది. ఈ మూడు దేశాలు ఆర్థికంగా, రక్షణపరంగా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తే, అమెరికా గ్లోబల్ ఆధిపత్యం ఒంటరితనంలోకి నెట్టబడే ప్రమాదం ఉంది.
మోదీ చైనా పర్యటనలో ఏం చేయనున్నారు..?
మోదీ చైనా పర్యటన భారత్-చైనా సంబంధాల్లో కీలక మలుపుగా చూస్తున్నారు. సరిహద్దు శాంతి ఒప్పందాలు, వాణిజ్య సహకారం, బ్రిక్స్ ఫోరమ్‌లో కొత్త ఆర్థిక ప్రతిపాదనలపై ఈ పర్యటనలో నిర్ణయాలు తీసుకోనున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో, భారత్ చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంచడం, స్వదేశీ సాంకేతికతలో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోంది. ఈ పర్యటన అమెరికాకు వ్యూహాత్మక సందేశంగా, భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నడపగలదని చాటుతుందని అంటున్నారు. Trump vs India China Russia.
భారత్, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సహకారం గ్లోబల్ రాజకీయ, ఆర్థిక వేదికను పునర్నిర్మిస్తుంది. ట్రంప్ విధానాలు అమెరికా మిత్రదేశాలను దూరం చేస్తున్నాయని, ఇది గ్లోబల్ పవర్ గా చెప్పుకునే అమెరికాను ఒంటరి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మూడు దేశాలు ఒకే దిశలో నడిస్తే, అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహం, ఆర్థిక ఆంక్షలు విఫలమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ కూటమి గ్లోబల్ ఆర్థిక, రక్షణ వ్యవస్థలో కొత్త నియమాలను రూపొందించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధానాలకు భారత్-చైనా-రష్యా సమాధానం త్వరలో వస్తుందని చెబుతున్నారు.
Also Read: https://mega9tv.com/international/elephant-mosquito-innovative-method-to-curb-chikungunya-in-china/