ఐక్యరాజ్యసమితిలో పాక్ వైఖరిని మరోసారి ఎండగట్టిన భారత్

Spread the love

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్పై ఆ దేశ అంబాసిడర్  చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టి జవాబిచ్చింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈనెల 26న యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాక్ అంబాసిడర్  ఆసిమ్ ఇఫ్తకార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జమ్మూకశ్మీర్, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని శిక్షిస్తూ సరికొత్త సాధారణ స్థితి నెలకొల్పినట్లు భారత్ చెబుతున్న పరిస్థితి ఏమీ కనిపించడం లేదని అన్నారు. ఈ విషయం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తమ ప్రతిస్పందనతోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా బదులిచ్చారు. అంతర్జాతీయ వేదికలపైన ప్రతిసారి పాకిస్థాన్ భారత్ కు, దేశ ప్రజలకు హాని కలిగించడమే పాకిస్థాన్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పగల్గామ్ ఎటాక్ తదనంతరం భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి వివరించారు. భారత అంతర్గత అంశాలపై మాట్లాడే హక్కు పాక్ కు లేదని గట్టిగా చెప్పారు. భారత్ లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమని పునరుద్ఘాటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అందుకే భారత్ దానిని నిలిపివేసిందని స్పష్టం చేశారు.