ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ తన 17 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫ్రాంచైజీ లీగ్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. 2021లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ లో రిచర్డ్‌సన్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున 25 వన్డేలు, 36 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పూణె వారియర్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్, యూఏఈలోని లీగ్‌లలో కూడా పాల్గొన్నాడు. ఇటీవలి కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతున్న 34 ఏళ్ల రిచర్డ్‌సన్, బీబీఎల్ 15వ సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున తన చివరి మ్యాచ్ లు ఆడాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 25 వన్డేలలో 39 వికెట్లు, 36 టీ20లలో 45 వికెట్లు పడగొట్టాడు.