బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ తాజాగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి భారత్ నుండి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. కాగా, అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తో భేటీ అయ్యారు. ఒక నిర్మాణాత్మకమైన సమావేశం ముగిసింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పంపిన వ్యక్తిగత లేఖను ఓం బిర్లా ప్రధాని రెహమాన్‌కు అందజేశారు. అందులో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారని పేర్కొన్నారు.
భారతదేశ ప్రజల తరపున ఓం బిర్లా సాదర అభినందనలు తెలిపారు. తారిఖ్ రెహమాన్ 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు. ఖాలిదా జియా కుమారుడైన రెహమాన్ 2008లో బంగ్లాదేశ్ విడిచి వెళ్లారు. 17 ఏళ్ల పాటు బ్రిటన్ లో ప్రవాస జీవితం గడిపారు. గతేడాది డిసెంబరులోనే స్వదేశానికి వచ్చారు. తల్లి మరణం అనంతరం పార్టీ బాధ్యతలు స్వీకరించి బీఎన్ పీని గెలుపు బాట పట్టించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన గెలుపొందారు. 299 పార్లమెంట్ స్థానాలకుగానూ 209 చోట్ల పార్టీ గెలిచింది. 2024లో హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత నేడు బంగ్లాదేశ్ లో తిరిగి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడింది.