ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ (ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం) స్థాయికి పెంచుకున్న తరుణంలో ఈ సమావేశం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండు దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి మరియు పురోగతికి బాటలు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. పరిశ్రమలు, రక్షణ, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో సహకారం గురించి చర్చించినట్లు తెలిపారు. మన దేశాలు స్టార్టప్‌లు మరియు MSMEల మధ్య బలమైన నెట్‌వర్క్‌లను నిర్మిస్తాయి, విద్యార్థులు మరియు పరిశోధకుల పరస్పర మార్పిడిని సులభతరం చేస్తాయి మరియు కొత్త ఉమ్మడి ఆవిష్కరణ కేంద్రాలను (Innovation Centres) ఏర్పాటు చేస్తాయన్నారు. భారతదేశంలో హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవం భారత్-ఫ్రాన్స్ మైత్రి ఎంత లోతుగా ఉందో చాటిచెబుతోందని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఎగరగల ఏకైక హెలికాప్టర్‌ను భారత్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా మన దేశంలోనే తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవు. ఇది లోతైన మహాసముద్రాల నుండి ఎత్తైన పర్వతాల శిఖరాల వరకు విస్తరించగలదని పేర్కొన్నారు.